హ్యాట్రిక్ కాంబినేషన్ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో రూపొందుతున్న అఖండ 2 తాండవం విడుదల సెప్టెంబర్ 25 నుంచి తప్పుకున్నట్టు పుట్టిన వార్త సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. అసలు తెరవెనుక ఏం జరుగుతుందా అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. ప్రస్తుతానికి డేట్ లో ఎలాంటి మార్పు లేదు. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ చకచకా చేసుకుంటూ వచ్చారు. ఒక పాట, కొంచెం ప్యాచ్ వర్క్ తప్ప ఇంకెలాంటి పెండింగ్ లేదు. కాకపోతే విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడేమైనా ఆలస్యమవుతుందేమోననే అనుమానాలు నెలకొన్నాయి.
నిర్మాణ సంస్థ 14 రీల్స్ మరో కోణంలో కూడా ఆలోచిస్తోంది. నేరుగా ఓజితో తలపెడితే ఎంత వరకు వసూళ్లు ప్రభావితం చెందుతాయనే దాని మీద తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. ఈ సంస్థకు బాలయ్య సినిమా చాలా కీలకం. కొంత కాలంగా ప్రొడక్షన్ కు దూరంగా ఉన్న ఈ బ్యానర్ అఖండ 2తో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. అందుకే ఎప్పుడో మొదలుపెట్టిన టైసన్ నాయుడుని పక్కన పెట్టి అఖండ 2ని పరుగులు పెట్టించారు. దీనికొచ్చే లాభాలు, రెవిన్యూతో సులభంగా బాలన్స్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు. కాకపోతే అఖండ 2కి సోలో డేట్ అయితే సేఫ్ గేమ్ అవుతుందనేది ఒక అభిప్రాయం.
దసరా సీజన్ ఈసారి కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనేది బోయపాటి శీను సంకల్పం. అందుకే పోస్ట్ పోన్ వార్తలు ఎన్ని వస్తున్నా చలించడం లేదు. ఒకవేళ సెప్టెంబర్ 25కి కట్టుబడాలంటే ఆ నెల మొదటి వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. తమన్ రీ రికార్డింగ్ కి తగినంత సమయం ఇవ్వాలి కనక ఇది చాలా కీలకం. పైగా నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అక్కడ ప్రమోషన్లు ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక ప్లానింగ్ అవసరం. ఒకవేళ ఏ కారణంతో అయినా అఖండ 2 వెనుకడుగు వేస్తే డిసెంబర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ముప్పు లేనట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates