నివాళి వేళ కోటపై ప్ర‌కాష్ రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

స్వ‌త‌హాగాక‌న్న‌డిగుడు అయిన‌ప్ప‌టికీ తెలుగులో లెక్క‌లేన‌న్ని సినిమాలు చేసి తెలుగు న‌టుడు అయిపోయారు ప్ర‌కాష్ రాజ్. న‌టుడిగా ప్ర‌కాష్ రాజ్ ప్ర‌తిభ ప‌ట్ల లెజెండ‌రీ యాక్ట‌ర్ కోట శ్రీనివాస‌రావుకు మంచి అభిప్రాయ‌మే ఉండేది కానీ.. తెలుగు న‌టుల‌ను పక్క‌న పెట్టి ప‌ర భాషా న‌టుడైన ఆయ‌న‌కు ఎక్కువ ఛాన్సులు ఇవ్వ‌డాన్ని కోట త‌ప్పుబ‌ట్టేవారు. కొన్నేళ్ల కింద‌ట మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప్ర‌కాష్ రాజ్ మీద ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో కోట‌, ప్ర‌కాష్ రాజ్‌ల‌కు ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు అనే అభిప్రాయం ఉండేది. కానీ త‌మ మ‌ధ్య మంచి స్నేహ‌మే ఉండేదంటూ ప్ర‌కాష్ రాజ్.. కోటకు నివాళి అర్పిస్తున్న సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

ఆదివారం తెల్ల‌వారుజామున కోట మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆయ‌న పార్థివ దేహానికి ప్ర‌కాష్ రాజ్ నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట‌కు త‌న మీద ఉన్న అభిప్రాయం గురించి.. త‌న గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు ప్ర‌కాష్ రాజ్.
తాను తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టే ముందు కోట సినిమాలు చూసి స్ఫూర్తి పొందిన‌ట్లు ప్ర‌కాష్ రాజ్ చెప్పారు. న‌ట‌న‌పై ఆయ‌న‌కున్న ప‌ట్టు త‌న‌లో స్ఫూర్తి నింపింద‌న్నారు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాక రెండు ద‌శాబ్దాల అనంత‌రం కోట‌తో క‌లిసి ప‌లు చిత్రాల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని ఆయ‌న‌న్నారు.

కోట విశిష్ట‌మైన వ్య‌క్తి అని.. ఆయ‌న అంద‌రికీ న‌చ్చ‌ర‌ని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. తెలుగు న‌టుల‌కు స‌రైన అవ‌కాశాలు దొర‌క‌డం లేద‌ని కోట ఆవేద‌న వ్య‌క్తం చేసేవార‌ని.. అలాంటి సంద‌ర్భంలో ప్ర‌కాష్ రాజ్ ప‌ర‌భాషా న‌టుడు క‌దా అని ఎవ‌రో ఆయ‌న ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. ‘కాదండీ, ప్ర‌కాష్ తెలుగు నేర్చుకున్నారు. మ‌న వాడు అయిపోయాడు’ అని చెప్పార‌ని ప్ర‌కాష్ రాజ్ వెల్ల‌డించారు. త‌న‌పైనా సెటైర్లు వేసేవార‌ని.. కానీ వాటిని స‌ర‌దాగానే తీసుకునేవాడిన‌ని ప్ర‌కాష్ రాజ్ తెలిపారు. గ‌త ఏడాది తాను, ఆలీ, బ్ర‌హ్మానందం, బ్ర‌హ్మాజీ ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్నామ‌ని.. ఆ టైంలో కోట గుర్తుకు వ‌చ్చార‌ని.. ఆయ‌న‌కు ఆరోగ్యం బాగా లేని విష‌యం తెలిసి ఫోన్ చేశాన‌ని ప్ర‌కాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. వీలుంటే సెట్‌కు ర‌మ్మ‌ని అడిగి వెహిక‌ల్ పంపిస్తే.. త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చి స‌ర‌దాగా మాట్లాడుకున్నామ‌ని ప్ర‌కాష్ రాజ్ తెలిపారు.