లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు పరమపదించడం తెలుగు వారిలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగు సినిమా చరిత్రలో కోటది ఎంతో ప్రత్యేకమైన స్థానం. ఒకరితో పోల్చలేని, ఎవరితోనూ భర్తీ చేయలేని స్థానం ఆయనది. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయగల అద్భుత నైపుణ్యం ఆయన సొంతం. ఇలాంటి లెజెండరీ నటుడితో.. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీకి ఒక సందర్భంలో గొడవ పడడం గమనార్హం. వీరి మధ్య కొన్ని రోజుల పాటు వాగ్వాదం నడిచింది. దీని వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది.
కృష్ణవంశీ తన చిత్రాల్లో ఎక్కువగా కీలక పాత్రలను ప్రకాష్ రాజ్‌కే ఇవ్వడం గమనించవచ్చు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాకు ప్రకాష్ రాజ్‌కు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చిన సందర్భంలో ఆయన్ని కొనియాడుతూ.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉందని, ఇంకా ఎక్కువమంది నటులు రావాలని కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కోటకు ఆగ్రహం తెప్పించాయి. తెలుగులో మంచి ఆర్టిస్టులు లేరని ఎలా అంటారు.. మీరు పాత్రలు ఇవ్వండి మన వాళ్లు టాలెంట్ చూపిస్తారు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. దానికి కృష్ణవంశీ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు నడిచాయి. మీ సినిమాలో నాకు పాత్ర ఇవ్వండి నేనేంటో చూపిస్తా అంటూ కోట సవాలు కూడా విసిరారు. వివాదం ముదరడంలో సినీ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
కట్ చేస్తే తర్వాత ‘రాఖీ’ సినిమాలో కోటకు హీరో తాతగా ఓ మంచి పాత్ర ఇచ్చారు కృష్ణవంశీ. అందులో కోట తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా ఇద్దరి మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోయాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. కోటతో గతంలో జరిగిన గొడవ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అప్పుడు తప్పు తనదే అని అంగీకరించారు. కోట లాంటి గ్రేట్ ఆర్టిస్టు విషయంలో తాను అలా గొడవ పడి ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోట కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ గొడవ గురించి మాట్లాడారు. తాను అప్పుడు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. మన నటులను తక్కువ చేస్తే తాను ఊరుకోనన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates