కోట- చిన్న న‌టుల కోసం పెద్ద యుద్ధం!

సినీ రంగంలో ఉద్య‌మాలు చేసిన వారు.. సినీరంగానికి ప్ర‌త్యేక గుర్తింపు కావాల‌ని కోరుకున్న వారు .. చాలా చాలా త‌క్కువ‌ మంది ఉన్నారు. ఇలాంటి వారిలో కోట శ్రీనివాస‌రావు ఒక‌రు. 1985-86 మ‌ధ్య కాలంలో ఆయన సినీ రంగంలోని చిన్న చిన్న పాత్ర‌లు వేసే వారికోసం మూడు రోజుల పాటు దీక్ష చేసి.. వారికి ప్ర‌త్యేక సాయం అందేలా చేశారు. అప్ప‌ట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు వేసే వారికి పెద్ద‌గా గుర్తింపు లేదు. అంతేకాదు.. డ‌బ్బులు కూడా సగం ఇచ్చి.. స‌గం ఎగ్గొట్టేవార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

మ‌రీ ముఖ్యంగా క‌మెడియ‌న్ పాత్ర‌లు వేసే వారికి అన్యాయం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ జోరుగా వినిపించేది. పైగా.. వేధింపులు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని చెప్పుకొనేవారు. మ‌రోవైపు.. సినీ రంగాన్ని ఇండ‌స్ట్రీగా గుర్తించ‌క‌పోవడం కూడా ఈ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న వాద‌న ఉంది. ఇలాంటి స‌మ‌యంలో చిన్న న‌టుల‌కు న్యాయం కావాల‌ని కోరుతూ.. కోట శ్రీనివాస‌రావు ట్యాంక్ బండ్ వ‌ద్ద‌.. నిరాహార దీక్ష‌కు దిగారు. అప్ప‌ట్లో ఆయ‌న స్వామి దీక్ష‌లో ఉన్నారు.

అయిన‌ప్ప‌టికీ.. చిన్న న‌టుల‌కు వేత‌నాలు పెంచ‌డంతోపాటు.. వారికి పూర్తిగా నిధులు చెల్లించాల‌న్న డిమాండ్‌తో ఆయ‌న దీక్ష‌కు దిగారు. ఇదేస‌మ‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇండ‌స్ట్రీ హోదా కూడా క‌ల్పించాలని ప‌ట్టుబ‌ట్టారు. ఇలా.. ఈ రెండు డిమాండ్ల‌తో కోట మూడు రోజుల పాటు.. నిర‌స‌న చేశారు. ఆయ‌న‌కు ఆ మూడు రోజుల పాటు కూడా.. అప్ప‌టి హీరో.. రాజ‌శేఖ‌ర్‌.. ద‌గ్గ‌రుండి వైద్య సేవ‌లు అందించారు. ఈ క్ర‌మం లోనే ఆయ‌న ఫైట్ ఫ‌లించి.. చిన్న న‌టుల‌కు న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

ఇదే స‌మయంలో సినీ ప‌రిశ్ర‌మ‌ను గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని. అప్ప‌టి ప్ర‌భుత్వం కూడా పేర్కొంది. అయితే.. త‌ర్వాత కాలంలో ఇది సాకారం కాలేదు కానీ.. చిన్న న‌టుల‌కు మాత్రం.. ఎంతో కొంత‌.. మేలు అయితే జ‌రిగింది. ఇదిలావుంటే.. త‌న ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేద‌న్న కార‌ణంగా.. ఆ త‌ర్వాత‌.. కోట సినీ ప‌రిశ్ర‌మ ఇబ్బందుల‌పై ఉద్య‌మించ‌డం మానేశారు. కానీ.. త‌ర‌చుగా బ‌హిరంగ వేదిక‌ల‌పైనే విమ‌ర్శించారు.