ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ‘తండేల్’ మూవీతో ఉపశమనాన్ని అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా గురించి రిలీజ్ ముంగిట టీం చెప్పిన స్థాయిలో అద్భుతాలు జరిగిపోకున్నా.. ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో హమ్మయ్య అనుకున్న చైతూ.. తన తర్వాతి చిత్రానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ.. ఒక భారీ మిస్టిక్ థ్రిల్లర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ మధ్యలో ఉంది.
దీని తర్వాత చైతూ నటించే సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అతను ఓ తమిళ దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. అతనే.. పి.ఎస్.మిత్రన్. తమిళంలో థ్రిల్లర్ చిత్రాలకు పేరుపడ్డాడు మిత్రన్. ఇప్పటిదాకా అతను తీసినవన్నీ థ్రిల్లర్ సినిమాలే. విశాల్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇరింబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మిత్రన్. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో తీసిన ‘శక్తి’ సినిమా కూడా హిట్ అయింది. ఆపై కార్తితో అతను చేసిన ‘సర్దార్’ ఇంకా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం మిత్రన్.. కార్తితోనే ‘సర్దార్-2’ చేస్తున్నాడు. దీపావళికి ఆ సినిమా రిలీజ్ కాబోతోంది.
మిత్రన్ తెలుగులో సినిమా చేస్తాడని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చైతూతో అతను సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తన శైలికి తగ్గట్లే థ్రిల్లర్ కథను చేయాలని అనుకుంటున్నాడట. అది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చైతూ తండ్రి నాగార్జున సైతం రా.కార్తీక్ అనే తమిళ దర్శకుడితో సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఆ సినిమా మొదలు కాబోతోంది. తండ్రి బాటలో చైతూ సైతం తమిళ దర్శకుడితోనే జట్టు కట్టబోతుండడం విశేషమే. త్వరలోనే ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఐతే గత కొన్నేళ్లలో తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేసిన సినిమాలేవీ సరిగా ఆడని విషయం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates