ఒక్కటి ఆగితే.. తొమ్మిది సినిమాల నుంచి తీసేశారు

విద్యా బాలన్.. లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్న బాలీవుడ్ కథానాయికగా. ఐతే తన పేరు చూస్తే ఆమె తమిళ అమ్మాయి అని అర్థమైపోతుంది. విద్య ఆహార్యం చూసినా దక్షిణాది లుక్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె పుట్టి పెరిగింది ముంబయే కావడంతో అక్కడే సినిమాల్లో ప్రయత్నం చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఐతే సౌత్ సినిమాలకు సూటయ్యే కథానాయిక అయినప్పటికీ ఆమె ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు. 

తెలుగులో నందమూరి బాలకృష్ణతో ‘యన్.టి.ఆర్’, తమిళంలో అజిత్‌తో ‘నీర్కొండ పార్వై’ లాంటి సినిమాల్లో మాత్రమే కనిపించింది. అది కూడా కెరీర్లో లేటు వయసులో ఆమె ఇక్కడ ఈ చిత్రాలు చేసింది. ఐతే తనకు దక్షిణాది సినిమాల్లో నటించకూడదనేమీ లేదని.. కెరీర్లో ప్రైమ్‌లో ఉండగానే ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నించానని.. కానీ తాను ఖరారైన సినిమాలన్నింటి నుంచి ఒకేసారి తనను తీసేశారని విద్య తాజాగా వెల్లడించింది.

గతంలో మోహన్ లాల్‌కు జోడీగా తాను ఒక మలయాళ సినిమాకు సంతకం చేశానని.. కొన్ని రోజులు చిత్రీకరణ కూడా జరిగిందని.. కానీ ఏవో కారణాలతో సినిమా మధ్యలో ఆగిపోయిందని విద్య చెప్పింది. ఐతే ఆ సినిమా ఆగిపోవడానికి తనే కారణం అని, తాను ఐరెన్ లెగ్ అని ప్రచారం చేశారని.. దీని వల్ల తాను అప్పటికే సంతకం చేసిన తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి తనను తప్పించారని విద్య వెల్లడించింది. 

నిజానికి దర్శకుడికి, మోహన్ లాల్‌కు మధ్య విభేదాలు రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని.. కానీ ఏ సంబంధం లేని తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి నెగెటివ్ ప్రచారం చేయడంతో సౌత్‌లో తన కెరీర్ దెబ్బ తిందని విద్య ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే మోహన్ లాల్‌ సినిమాకు సంబంధించి ఏం జరిగిందో కానీ.. మరీ దక్షిణాదిన తొమ్మిది సినిమాలు కమిటైతే, అన్నింటి నుంచి తనను తప్పించారని విద్య చెప్పడం మాత్రం కొంచెం అతిశయోక్తిగానే ఉంది.