నాని స్కెచ్‍ అదరహో!

నాని ఇటీవల ఇమేజ్‍ మేకోవర్‍ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ‘వి’ సినిమాలో నెగెటివ్‍ షేడ్స్ వున్న క్యారెక్టర్‍ చేసిన నానికి ఆశించిన ఫలితం రాలేదు. అయినా కానీ ‘శ్యామ్‍ సింగ రాయ్‍’ చిత్రంలో మరోసారి విభిన్నమైన పాత్ర పోషించడానికి సమాయత్తమవుతున్నాడు. పక్కింటి అబ్బాయి, మిడిల్‍ క్లాస్‍ కుర్రాడు, మనలో ఒకడు… తదితర లక్షణాలుండే పాత్రలు నాని యు.ఎస్‍.పి. ముఖ్యంగా కామెడీకి ఆస్కారమున్న పాత్రల్లో నాని అదరగొడతాడు. కానీ అతను ఇలా ఇమేజ్‍ మేకోవర్‍ ఎందుకు ట్రై చేస్తున్నాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తన మార్కు పాత్రలకు నాని పూర్తిగా దూరం కావడం లేదు. ప్రతి మూడు సినిమాల్లో ఒకటి అలాంటి క్యారెక్టరే వుండేలా చూసుకుంటున్నాడు. శ్యామ్‍ సింగరాయ్‍ తర్వాత వివేక్‍ ఆత్రేయ దర్శకత్వంలో నటించే చిత్రం పేరు ‘అంటే సుందరానికి…’ అట. హీరో పేరు సుందరం అంటేనే ఆ పాత్ర ఎలా వుంటుందనేది అర్థమవుతోంది. అవుట్‍ అండ్‍ అవుట్‍ కామెడీగా రూపొందే ఈ చిత్రం పాత జంధ్యాల – రాజేందప్రసాద్‍ సినిమాలను తలపించేలా వుంటుందట.

హీరోయిన్‍ పాత్ర కూడా చాలా ప్రత్యేకం కావడం వలనే మలయాళ నటి నజ్రియాను ఖాయం చేసుకున్నారట. ఇటు తన జోన్‍నుంచి పూర్తిగా బయటకు వెళ్లకుండా, తన ఇమేజ్‍ను కాపాడుకుంటూనే మధ్యలో ప్రయోగాలు చేస్తోన్న నాని స్కెచ్‍ అదుర్స్ అనేది ఇండస్ట్రీ మాట.