ఏఎం రత్నంకు ప్రభుత్వ పదవి ఖాయమైందా?

దక్షిణాదిన ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా వైభవం చూశారు ఏఎం రత్నం. 90వ దశకంలో ఏఎం రత్నం ‘సూర్య మూవీస్’ నుంచి సినిమా అంటే ఒక రేంజ్ ఉండేది. శంకర్‌తో భారతీయుడు, ఒకే ఒక్కడు.. పవన్ కళ్యాణ్‌‌తో ఖుషి లాంటి సినిమాలు తీసి నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నాడాయన. కానీ తర్వాతి కాలంలో వరుస పరాజయాలు ఆయన్ని వెనక్కి లాగేశాయి. ప్రొడ్యూసర్‌గా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తో పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నారు రత్నం. 

ఆయన్ని త్వరలోనే ఓ ప్రభుత్వ పదవిలో చూడబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించనుందట. తెలంగాణలో ఈ పదవిలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఆ పదవిలో ఎవరినీ నియమించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రత్నం చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. నిర్మాతగా దెబ్బ తిన్న రత్నంకు ఇంకో సినిమా చేయాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నించి.. చివరికి ‘హరిహర వీరమల్లు’ను లైన్లో పెట్టాడు పవన్. కానీ ఆ సినిమా బాగా ఆలస్యమై రత్నం మీద మోయలేని భారం పడింది. 

పవన్ పొలిటికల్ కమిట్మెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఎంత ఆలస్యమైనా ఓపిగ్గా ఎదురు చూశారు రత్నం. ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆయన భాగమయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రత్నంను ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాలని పవన్ భావిస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అడిగితే.. ఆ దిశగా పవన్ ఆలోచిస్తున్నారని.. ఆయన అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేద్దామని అన్నారు రత్నం. ఇంకో నెలా రెండు నెలల్లో ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముంది.