తమ్ముడు కాదు.. కన్నప్ప కాదు.. ఇదే టాప్

ఈ రోజుల్లో కొత్త సినిమాల జోరంతా వీకెండ్ వరకే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా వారాంతం తర్వాత డల్ అయిపోతుంటాయి. ఇంకో వీకెండ్ వచ్చేసరికి మళ్లీ కొత్త సినిమాలు వస్తాయి. అవి లీడ్ తీసుకుంటాయి. ముందు వారం వచ్చిన సినిమా చల్లబడిపోతుంటుంది. ఐతే ఈ వీకెండ్లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త సినిమాకు ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. గత వారం వచ్చిన సినిమాకు కూడా స్పందన గొప్పగా లేదు.

కానీ రెండు వారాల ముందు రిలీజైన సినిమానే లీడ్ తీసుకుంటుండడం విశేషం. ఆ చిత్రమే.. కుబేర. ఈ సినిమా రిలీజై రెండు వారాలు దాటినా.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్‌గా సాగుతోంది. వీక్ డేస్‌లో ఆక్యుపెన్సీలు పెద్దగా లేవు కానీ.. వీకెండ్ వచ్చేసరికి ధనుష్-నాగ్‌ల సినిమా ,రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌లో మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు స్పందన బాగుంది.

ఈ వీకెండ్లో రిలీజైన ‘తమ్ముడు’ సినిమాకు పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు నుంచే డల్లుగా నడుస్తోంది. శని, ఆదివారాల్లో వసూళ్లు ఆశాజనకంగా లేవు. సినిమా రిజల్ట్ ఏంటో అర్థమైపోయాక నిర్మాత దిల్ రాజు దీన్ని పుష్ చేయడానికి ప్రయత్నించట్లేదు. ఇక గత వారం రిలీజైన ‘కన్నప్ప’ తొలి వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయిపోయింది. మళ్లీ ఆ సినిమా పుంజుకోలేదు. వీకెండ్ వచ్చాక కూడా ‘కన్నప్ప’ ఆక్యుపెన్సీల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ రెండు చిత్రాలనూ వెనక్కి నెట్టి పాత చిత్రమైన ‘కుబేర’ లీడ్ తీసుకోవడం విశేషమే. ఐతే తమిళంలో మాత్రం ‘కుబేర’ తొలి వీకెండ్ తర్వాత వాషౌట్ అయిపోయింది. అక్కడ డిజాస్టర్ అయిన సినిమా.. తెలుగులో మాత్రం సూపర్ హిట్ రేంజిని అందుకుంది.