నిన్న హైదరాబాద్ కు చెందిన యువకుడు పైరసీ కేసులో దొరికిపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆనందానికి గురి చేసింది. తమిళ్ ఎంవి లాంటి సైట్లకు మొబైల్ ఫోన్ లో షూట్ చేసిన కొత్త సినిమాలు అమ్మే ఏసి టెక్నీషియన్ ని తగిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేయడంతో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. రిలీజైన రోజే థియేటర్ కు వెళ్లి రహస్యంగా షూట్ చేసిన పూర్తి వీడియోలను టెలిగ్రామ్ తదితర యాప్స్ ద్వారా ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్మిన వైనం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వేల రూపాయల కక్కుర్తికి వందల కోట్ల ప్యాన్ ఇండియా సినిమాలను తాకట్టు పెడుతున్న దారుణమైన ఉదంతమిది.
గత ఆరేడు నెలలుగా ఈ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గేమ్ ఛేంజర్, తండేల్ టైంలో ఇది తీవ్ర రూపం దాల్చి ఏకంగా హెచ్డి ప్రింట్లను బయటికి వచ్చేలా చేసింది. అయితే నిర్మాతలు వివిధ మార్గాల్లో వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేకపోయారు. ఎట్టకేలకు ఒక లింక్ అయితే దొరికింది. అయితే పైరసీ చేసే సైట్లది చాలా పెద్ద మాఫియా. సూర్య వీడోక్కడేలో చూపించినట్టు అంతు చిక్కని ప్రాంతాల్లో ఎక్కడెక్కడో మూలాలు ఉంటాయి. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థను కూకటివేళ్ళతో సహా పెకిలించి వేయాలంటే ప్రభుత్వాల సహకారం తప్పనిసరిగా కావాలి.
ఎఫ్డిసి చైర్ మెన్ గా దిల్ రాజు ప్రత్యేక కమిటీని వేయబోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులతో అనుసంధానం చేసుకుంటూ పైరసీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేయబోతున్నారు. వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీటిని అణచడం కష్టం. తెలుగులోనే కాదు హిందీ, తమిళ, మలయాళం ఇలా ప్రతి భాషకు పైరసీ భూతం తీవ్రంగా ఉంది. అందరూ సమిష్టిగా చేతులు కలిపితే ఖచ్చితంగా మార్పు తీసుకురావొచ్చు. థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి పైరసీ కూడా కారణమవుతోంది. ఓటిటి కన్నా ఎక్కువ ముప్పు దీంతోనే ఉందని ప్రొడ్యూసర్లకు తెలుసు. ఇప్పటికైనా వేగంగా అడుగులు పడుతున్నాయి. అదే పదివేలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates