గేమ్ చేంజ‌ర్ డ్యామేజ్ ముందే తెలిసిపోయింది – దిల్ రాజు

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించే సినిమా.. పైగా త‌మిళ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజుతో కాంబినేష‌న్.. ఇలా గేమ్ చేంజ‌ర్ సినిమా అనౌన్స్ అయిన‌పుడు మెగా అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు. కానీ ఈ సినిమా రిలీజ‌య్యే స‌మ‌యానికి ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. సినిమా విప‌రీతంగా ఆలస్యం అయింది. పైగా టీజ‌ర్, ట్రైల‌ర్ ఎగ్జైటింగ్‌గా అనిపించ‌లేదు. దీనికి తోడు తొలి రోజు బ్యాడ్ టాక్ రావడంతో సినిమా దారుణ‌మైన ఫ‌లితాన్ని అందుకుంది. దిల్ రాజును ఈ సినిమా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.

ఆయ‌న కెరీర్లోనే అత్య‌ధిక న‌ష్టాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఆ న‌ష్టం రూ.100 కోట్ల పైమాటే అన్న‌ది అంచ‌నా. ఐతే ఈ సినిమా త‌న‌ను ఆర్థికంగా పెద్ద దెబ్బ కొట్ట‌బోతున్న విష‌యం రిలీజ్‌కు ముందే త‌న‌కు అర్థం అయిపోయింద‌ని రాజు చెప్పాడు. కానీ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా మీద చాలా న‌మ్మ‌కం ఉండ‌డంతో తాను రిక‌వ‌ర్ అవుతాన‌నే ధీమా కూడా అదే స్థాయిలో వచ్చింద‌ని రాజు చెప్పాడు. గేమ్ చేంజ‌ర్ తొలి రోజు ప‌రిస్థితి చూడ‌గానే అదెంత డ్యామేజ్ చేస్తుంద‌న్న దానిపై త‌న‌కు అంచ‌నా వ‌చ్చింద‌ని రాజు తెలిపాడు. ఇంకో మూడు రోజుల్లో సంక్రాంతికి వ‌స్తున్నాం మ్యాజిక్ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాన‌ని.. అనుకున్న‌ట్లే ఆ సినిమా త‌న‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను, మొత్తంగా ఇండ‌స్ట్రీని సేవ్ చేసింద‌ని రాజు చెప్పాడు.

గేమ్ చేంజ‌ర్‌తో పాటు త‌న సంస్థ సినిమానే అయిన సంక్రాంతికి వ‌స్తున్నాంను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ పెద్ద మ‌న‌సుతో ఒప్పుకున్నార‌ని రాజు వ్యాఖ్యానించాడు. గేమ్ చేంజ‌ర్ న‌ష్టం వంద కోట్లు ఉండొచ్చా అంటే దాదాపు ఔన‌న్న‌ట్లే మాట్లాడారు రాజు. సంక్రాంతికి వ‌స్తున్నాం నుంచి వ‌చ్చిన లాభాల‌ను తానేమీ తీసుకోలేద‌ని.. గేమ్ చేంజ‌ర్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన త‌న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కే పంచాన‌ని.. మొత్తం ఓవ‌ర్ ఫ్లోస్ అన్నీ వాళ్ల‌కే వెళ్లాయ‌ని.. అందువ‌ల్ల వాళ్లు, ఇండ‌స్ట్రీ సేవ్ అయింద‌ని రాజు పేర్కొన్నాడు.