లాక్ డౌన్ కారణంగా రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి, నెట్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల్లో సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతుంటే, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ట్రాఫిక్‌ను తట్టుకోలేక సెట్టింగ్స్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌లు అయితే పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఫుల్లు గిరాకీ పెరిగింది. ఈ టైమ్‌లోనే అమెజాన్ ఓ అదిరిపోయే ఐడియా వేసింది.
దేశంలో అతిపెద్ద టెలివిజన్ సంస్థల్లో ఒకటైన జీ గ్రూప్‌తో ఓ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది అమెజాన్. జీ ఛానెల్స్‌లో వచ్చే కొన్ని సూపర్ హిట్ సినిమాలను తీసుకుని, అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయాలని భావిస్తోంది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. జీగ్రూప్‌కు ఇప్పటికే ‘జీ5’ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫాం ఉంది. అమెజాన్ అంత రేంజ్‌లో కాకపోయినా, జీ5కి కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.
దాంతో ఇప్పుడు ఆ సినిమాలను ఆమెజాన్‌కి ఇస్తే, జీ5కి వ్యూస్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. దాంతో జీ నెట్‌వర్క్ ఆలోచనలో పడిందట. ఆ సినిమా హక్కులను ఇచ్చేందుకు భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. అయితే లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో అమెజాన్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.