పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘కాంతార’ సినిమాతో పాపులారిటీ సంపాదించిన కన్నడ అమ్మాయి సప్తమి గౌడ. ఆ సినిమా తర్వాత ఆమెకు బహు భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. హిందీలో ‘వ్యాక్సిన్ వార్’తో పాటు మరో చిత్రంలోనూ ఆమె నటించింది.. ఇక తెలుగులో ‘తమ్ముడు’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో ఆమె అవకాశం దక్కించుకుంది. నితిన్ హీరోగా ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించిన చిత్రమిది. ఇందులో ఆమెతో పాటు వర్ష బొల్లమ్మ నితిన్ సరసన కథానాయికలుగా నటించారు.
ఐతే సప్తమి ఇందులో లీడ్ హీరోయిన్లలో ఒకరైనప్పటికీ.. హీరో నితిన్‌తో కేవలం రెండు గంటలు మాత్రమే చిత్రీకరణలో పాల్గొందట. తనది సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రే అయినప్పటికీ.. నితిన్ కాంబినేషన్లో తనకు సన్నివేశాలే ఉన్నాయట. దీంతో కేవలం రెండు గంటలు మాత్రమే నితిన్‌తో చిత్రీకరణలో పాల్గొనే అవకాశం దక్కిందని ఆమె ‘తమ్ముడు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సినిమాలో తన మీద ఎక్కువగా సోలో సీన్లే తీశారని.. హీరో కాంబినేషన్లో చాలా తక్కువ సమయం చిత్రీకరణ జరగడంతో నితిన్‌తో పెద్దగా మాట్లాడే అవకాశం కూడా తనకు రాలేదని సప్తమి చెప్పింది.
‘కాంతార’ సినిమాలో తన నటన నచ్చి ‘తమ్ముడు’ సినిమా కోసం ఎంచుకున్నప్పటికీ.. నేరుగా ఏమీ తనకు సినిమాలో అవకాశం ఇవ్వలేదని.. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆడిషన్ చేసి, ఔట్ పుట్ చూశాకే ఓకే చేశారని సప్తమి వెల్లడించింది. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని.. కథ మలుపు తిరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని సప్తమి చెప్పింది. కొన్ని కారణాల వల్ల ‘తమ్ముడు’ చిత్రీకరణ ఆలస్యమై తన తెలుగు అరంగేట్రం ఆలస్యం అయిందని.. కానీ ఆలస్యం అయినా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని, తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని సప్తమి ధీమా వ్యక్తం చేసింది. ‘తమ్ముడు’ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates