మంచు వారి కలల సినిమా కన్నప్ప విడుదలకు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మంచు విష్ణు. బుధవారమే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని.. ఒక్క రోజు గడిచేలోపే 1.25 లక్షల టికెట్లు బుక్ అయినట్లు తనకు రిపోర్ట్ అందిందని.. ఇది తనకు కలలా అనిపిస్తోందని మంచు విష్ణు అన్నాడు. ఇది శివలీల అని విష్ణు పేర్కొన్నాడు.
తన సినిమాకు ఇలాంటి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్న విష్ణు.. తనకు కూడా కన్నప్ప టికెట్లు దొరకడం కష్టమైందని చెప్పుకొచ్చాడు. తాను ఇంకా కన్నప్ప ఫైనల్ కాపీ చూడలేదని.. శుక్రవారం ఉదయం తన తండ్రితో పాటు స్పెషల్ షో చూద్దామని ఒక థియేటర్లో టికెట్లు అడిగితే.. అన్నీ అయిపోయాయని.. టికెట్లు ఇవ్వడం కష్టమని చెప్పారని విష్ణు వెల్లడించాడు.
దీంతో తమ కోసం మరో షో ఏర్పాటు చేసుకున్నట్లు విష్ణు తెలిపాడు. సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ సాధ్యమైందంటే అది ప్రభాస్ వల్లే అని ఈ సందర్భంగా విష్ణు చెప్పాడు.
ఇక కన్నప్ప నుంచి నుంచి రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన వార్నింగ్ నోట్ గురించి విష్ణు స్పందించాడు. ఇది వార్నింగ్ కాదని.. తనకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేదని అతను చెప్పాడు. కన్నప్ప సినిమా గురించి నెగెటివ్ క్యాంపైన్ చేయడానికి ఒక వర్గం కాచుకుని కూర్చుందని.. వాళ్లను ఉద్దేశించే ఇలా నోట్ రిలీజ్ చేశామని విష్ణు తెలిపాడు.
మెజారిటీ జనానికి సినిమా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందని… సీనియర్ జర్నలిస్టులు సినిమాలో తప్పొప్పులను సరిగా విశ్లేషించి రివ్యూలు రాస్తారని.. అలా కాకుండా పనిగట్టుకుని సినిమా గురించి దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి గురించే తమకు అభ్యంతరమని విష్ణు తెలిపాడు. ఒక థియేటర్ దగ్గర గొడవ చేయాలని ఒక బ్యాచ్ ప్రణాళిక వేసుకుందని తమకు సమాచారం అందిందని విష్ణు చెప్పాడు.
అలాగే థియేటర్ల దగ్గర నెగెటివ్ రివ్యూలు ఇవ్వడానికి కూడా కొందరు రెడీ అయ్యారన్నాడు. బాలీవుడ్ మీడియా వాళ్లకు తాము స్పెషల్ షో వేసి చూపిస్తే పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని.. ఈలోపే 40 మందికి పైగా నెగెటివ్ రివ్యూలు పెట్టారని.. వాళ్లెవ్వరో గుర్తించామని.. పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిని, షో చూస్తూ వీడియోలు పెట్టేవారిని కచ్చితంగా బ్లాక్ చేయిస్తామని విష్ణు హెచ్చరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates