టికెట్ల రేట్లపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాని గురించి ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా గొప్పగా మాట్లాడుతుంటారు. దేశంలో మరెక్కడా లేనన్ని థియేటర్లు ఏపీ, తెలంగాణల్లో ఉన్నాయి. కానీ ఈ థియేటర్లలో ఆక్యుపెన్సీలు అంతకంతకూ పడిపోతుండడం గురించి ఇటీవల ఆందోళన వ్యక్తమవుతోంది. పేరున్న సినిమాలకు కూడా ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఓవైపు ఓటీటీల ప్రభావానికి తోడు.. టికెట్ల ధరలు ఎక్కువ ఉండడం, పెద్ద సినిమాలకు ఇంకా పెంచేస్తుండడం.. థియేటర్లలో క్యాంటీన్ల ధరలు కూడా ఎక్కువ ఉండడం ప్రతికూలంగా మారుతోందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించే విషయమై ఇండస్ట్రీ గట్టిగా ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన వంతుగా తన ప్రొడక్షన్ నుంచి రానున్న ‘తమ్ముడు’ సినిమాకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ మధ్య మిడ్ రేంజ్ సినిమాలకు కూడా తొలి వారం టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాల నుంచి అనుమతులు పొందుతున్నారు నిర్మాతలు. ‘కుబేర’ సినిమాకు కూడా ఏపీలో రేట్లు పెంచుకున్నారు. తాను మాత్రం ‘తమ్ముడు’ సినిమాకు రేట్లు పెంచట్లేదని రాజు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎలాగూ రేట్లు పెంచుకునే అవకాశం లేదు. ఏపీలో కూడా తాము ఆ ప్రయత్నం చేయలేదని రాజు చెప్పారు.

ప్రభుత్వం నిర్దేశించిన నార్మల్ రేట్లతోనే సినిమా రిలీజవుతుందన్నారు. ఇక ఎగ్జిబిటర్లు అందరితోనూ మాట్లాడామని.. క్యాంటీన్ రేట్లను వీలైనంత తగ్గించాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పానని రాజు తెలిపారు. టికెట్ల రేట్లు, క్యాంటీన్ ధరల విషయంలో అసంతృప్తితో ప్రేక్షకులు థియేటర్లకు తగినంత స్థాయిలో రావట్లేదన్నది వాస్తవమని రాజు అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి భారీ చిత్రాల మీద పెట్టుబడి ఎక్కువ పెడతారు, మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తారు కాబట్టి రేట్లు పెంచుకోవడంలో తప్పు లేదని.. కానీ మామూలు సినిమాలకు కూడా రేట్లు పెంచితే థియేటర్లకు జనాలు ఎలా వస్తారని రాజు ప్రశ్నించారు. ఈ విషయంలో ఇండస్ట్రీ ఆలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని రాజు గుర్తు చేశారు.