షోలేకు నిజమైన గౌరవం ఇదే

బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమాని గొప్ప మలుపు తిప్పిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా షోలే స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు. 1975లో రిలీజైన ఈ మాస్టర్ పీస్ ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని సరికొత్తగా రీ మాస్టరింగ్ చేసి ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు. అందులో విశేషం ఏముంది, మన దగ్గర కూడా చాలా చేశారుగా అనుకోవచ్చు. కానీ షోలే వెనుక జరిగిన కసరత్తు, కష్టం వేరే ఉన్నాయి. అవేంటో చూద్దాం. 2022లో సిప్పి వారసుడు షెహజాద్ సిప్పి ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ని సంప్రదించాడు. షోలేని రీ స్టోర్ చేసి దానికి డిజిటల్ శాశ్వతత్వం ఇవ్వాలనేది అతని ఆలోచన.

షోలేకు సంబందించిన ఒరిజినల్ 35 ఎంఎం కెమెరాతో పాటు సౌండ్ నెగటివ్స్ ముంబైలో ఉన్న ఒక పాత వేర్ హౌస్ లో దొరకబుచ్చుకున్నారు. అదనపు ఫుటేజ్ కు అవసరమైన రీల్స్ యుకెలో ఉన్న ఇరాన్ మౌంటెన్ లో దొరికాయి. దీనికి బ్రిటిష్ ఫిలిం ఇన్స్ ట్యూట్ సహకరించింది. ముంబై, లండన్ లో సేకరించిన నెగటివ్స్ ని భద్రంగా బెలోగ్నాలో ఉన్న లాఇమాజిన్ రిట్రోవటకు పంపించారు. సెన్సార్ సూచించిన క్లైమాక్స్ కాకుండా మరో ఎండింగ్ ఉన్న ఫుటేజ్ లండన్ లోనే దొరికింది. 70 ఎంఎం ప్రింట్స్ దొరికే అవకాశం లేకపోవడంతో షోలే కెమెరా విభాగంలో పని చేసిన కమలాకర్ రావు సహాయం తీసుకున్నారు.

ఇలా మూడు సంవత్సరాల పాటు షోలే రీ స్టోరేషన్ అనేది ఒక యజ్ఞంలా జరిగింది. వందలాది రీళ్లను వడబోసి కలర్లు పాడవ్వకుండా ఒరిజినల్ ఫీల్ వచ్చేలా చేయడానికి ఫిలిం హెరిటేజ్ సభ్యులు ప్రాణం పెట్టేశారు. ఇప్పుడీ ప్రీమియర్ ఇటలీలో జరగనుంది. త్వరలోనే ఇండియాలో స్క్రీనింగ్ చేయబోతున్నారు. కొన్నేళ్ల క్రితం 3డికి మార్చి రీ రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు డెవలప్ చేసిన ప్రింట్ అన్నింటికన్నా గొప్పగా ఉంటుందని  తెలిసింది. అయిదు సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా థియేటర్లలో ఆడి ఇప్పటిదాకా పాతిక కోట్ల టికెట్లు అమ్మిన ఏకైక సినిమాగా చరిత్ర సృష్టించిన షోలేని మళ్ళీ బ్రతికించడం కన్నా నివాళి ఏముంటుంది.