కూలీకి మొదటిసారి నెగిటివిటీ వచ్చింది

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న కూలీకి ఎంత హైప్ ఉందో చెప్పనక్కర్లేదు. పూర్తి స్థాయి టీజర్ రాకముందే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఓ రేంజ్ లో ఊరిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం గురించి తెలిసిందే. ఇంత భీభత్సమైన బజ్ ఉన్న టైంలో కూలీకి మొదటిసారి నెగటివిటీ కనిపిస్తోంది. హిందీ టైటిల్ ని మజ్దూర్ గా నిర్ణయించడం ఈ ప్రతికూలతకు కారణం. ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం దిలీప్ కుమార్ లాంటి సీనియర్లు వాడుకున్న అవుట్ డేటెడ్ పేరని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కూలీలో ఉన్న పవర్ ఫుల్ సౌండింగ్ మజ్దూర్ లో లేదు. అయితే దీనికి  తెరవెనుక కారణాలు ఉన్నాయట. అమితాబ్ బచ్చన్ నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ కూలీ 1981లో వచ్చింది. దీని షూటింగ్ లోనే బిగ్ బి తీవ్రంగా గాయపడటం, దేశవ్యాప్తంగా జనాలు పూజలు ప్రార్ధనలు చేయడం అప్పట్లో సంచలనం. దానికి తగ్గట్టే సినిమా  బ్లాక్ బస్టర్ అయ్యింది. టైటిల్ హక్కులు నిర్మాత తన వద్దే అట్టిపెట్టుకున్నారని ముంబై రిపోర్ట్. తర్వాత గోవిందా కూలి నెంబర్ 1, వరుణ్ ధావన్ కూలి నెంబర్ 1 వచ్చాయి కానీ వట్టి కూలీగా హిందీలో సినిమాలు రాలేదు. తెలుగులో యాక్షన్ కింగ్ అర్జున్, రియల్ స్టార్ శ్రీహరి వేర్వేరుగా చేశారు.

సో కాపీ రైట్స్ సమస్య వల్లే కూలిని మజ్దూర్ గా మార్చాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. రీజన్స్ ఏమైనా పాజిటివ్ హైప్ మీద ఈ మార్పు ప్రభావం చూపించేలా ఉంది. అసలే ఆగస్ట్ 14 జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 విడుదలవుతోంది. దాన్ని తట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్లను సంపాదించడం కూలికి పెద్ద టాస్క్. అలాంటిది ఈ టైంలో టైటిల్ ఛేంజ్ చేయడం పట్ల మూవీ లవర్స్ అసంతృప్తి ఎక్స్ వేదికగా కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా తన స్టైల్ లో కనక లోకేష్ కనగరాజ్ మెప్పిస్తే మాత్రం వసూళ్ల సునామి ఖాయం. ట్రైలర్ వచ్చాక కొంత క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే.