ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో రీమిక్స్ సాంగ్స్ చేయని సంగీత దర్శకులు అరుదు. ముఖ్యంగా దక్షిణాదిన చాలామంది సంగీత దర్శకులు ఈ ప్రయత్నాలు చేసిన వాళ్లే. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం వాటి జోలికి వెళ్లడు. దేవి సినిమాలు వేటిలోనూ రీమిక్స్ సాంగ్స్ లేకపోవడం గమనించవచ్చు. హరీష్ శంకర్ సినిమా గద్దలకొండ గణేష్ కోసం ముందు దేవినే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పటికీ.. అందులో ఓ రీమిక్స్ సాంగ్ (వెల్లువొచ్చి గోదారమ్మ) చేయాల్సి రావడంతో అతను సినిమా నుంచి తప్పకున్న విషయాన్ని హరీష్ శంకర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవి ఈ రీమిక్స్ పాటలకు నో చెప్పే పాలసీ గురించి మాట్లాడాడు. వేరొకరు చేసిన పాటలను రీమిక్స్ చేయొద్దు అని తన కెరీర్ ఆరంభంలోనే తనకు తానుగా ఒక రూల్ పెట్టుకున్నట్లు దేవి తెలిపాడు. మనం ఉన్నది పాటలను క్రియేట్ చేయడానికని.. రీ క్రియేట్ చేయడానికి కాదని.. అందుకే తాను రీమిక్స్ పాటలకు వ్యతిరేకం అని దేవి చెప్పాడు. అలా అని అది మంచిదా, చెడ్డదా అనేది తాను చెప్పనని.. అలాంటి పాటలు చేసే వాళ్లను విమర్శించనని దేవి చెప్పాడు. వేరే వాళ్లు మంచి రీమిక్స్ పాటలు చేస్తే అప్రిషియేట్ చేస్తానని.. పాట బాగుంటే వింటానని దేవి చెప్పాడు.
కానీ తాను మాత్రం రీమిక్స్ పాటలు చేయొద్దని నియమం పెట్టుకున్నట్లు దేవి చెప్పాడు. ఈ పాటలు చేయకపోవడం వల్ల తాను వదులుకున్న సినిమాల సంఖ్య పెద్దదే అన్నాడు. గత ఏడాది కూడా ఓ పెద్ద సినిమాను ఇలాగే విడిచిపెట్టినట్లు చెప్పాడు. అది అజిత్ కుమార్ హీరోగా చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ అని భావిస్తున్నారు. అందులో రీమిక్స్ సాంగ్స్ ఒకటికి మించే ఉంటాయి. దేవిశ్రీ ఇటీవలే కుబేర చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయాయనే టాక్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌లో దేవి పాత్ర కీలకమని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీమిక్స్ పాటల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు దేవి.
Gulte Telugu Telugu Political and Movie News Updates