ఇన్ని కండీషన్లు ఎందుకు అమీర్ భాయ్

ఈ వారం విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ మీద అమీర్ ఖాన్ కాసింత ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాడు. ఎడతెగని ప్రమోషన్లతో మీడియాకు గతంలో ఎప్పుడూ లేనన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ విలక్షణ హీరో పబ్లిసిటీ పరంగా ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టే ఉద్దేశంలో లేడు. ఓటిటి సంస్థలు పోస్ట్ థియేటర్ రిలీజ్ స్ట్రీమింగ్ కి వంద కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా తిరస్కరించిన అమీర్ ఈసారి యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తాడనే దాని మీద ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇవి చాలదన్నట్టు తన సినిమాను వేసుకునే ఎగ్జిబిటర్లకు అమీర్ కండీషన్లు షాక్ ఇస్తున్నాయి.

వాటి ప్రకారం దేశవ్యాప్తంగా ఏ థియేటర్, మల్టీప్లెక్సులో సితారే జమీన్ పర్ షో ఉదయం 11 గంటల కన్నా ముందే వేయకూడదు. ఒకవేళ సింగల్ స్క్రీన్ లో ఈ సినిమా కావాలంటే మొత్తం నాలుగు షోలు దీనికే కేటాయించాలి. షేరింగ్ ఉండదు. ఉదాహరణకు ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో కుబేర, 8 వసంతాలు లాంటి ఇతర బాషా సినిమాలకు ఒకటో రెండో షోలు ఇద్దామంటే కుదరదు. అన్నీ అమీర్ కు ఇవ్వాల్సిందే. లేదంటే వదులుకోవాలి. రెండు స్క్రీన్లున్న సముదాయమైతే ఖచ్చితంగా మొదటి రోజు ఎనిమిది షోలు వేయాల్సిందే. స్క్రీన్ సంఖ్యను బట్టి ఇవి పెరుగుతాయి. సాయంత్రం 6 లోపు అవి పూర్తవ్వాలి. ఆపై ఎక్స్ ట్రా షోలు కావాలంటే ఎగ్జిబిటర్ ఇష్టం.

ఏదో బాహుబలి, కెజిఎఫ్, కల్కి లాగా విజువల్ గ్రాండియర్ తీసినట్టు అమీర్ ఖాన్ ఇన్నేసి నిబంధనలు పెట్టడం డిస్ట్రిబ్యూటర్లు ఇష్టపడటం లేదు. పబ్లిక్ టాక్ ని బట్టి అప్పటికప్పుడు షోలను మార్చుకునే వెసులుబాటు హక్కు అందరికీ ఉంటుందని, కానీ  బలవంతంగా ఫస్ట్ డే ఇన్నేసి షోలు వేయమని చెప్పడం భావ్యం కాదని అంటున్నారు. పోనీ అరివీర భీభత్సంగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే అదీ లేదు. ట్రెండింగ్ లో ఉన్నాయి కానీ మరీ గొప్పగా కాదు. మొదటి రోజే కాదు వారం వరకు సితారే జమీన్ పర్ ఇలాంటి కండీషన్లు చాలానే పెట్టిందట. టాక్ బాగా వస్తే ఓకే లేదంటే ఈ స్ట్రాటజీ రివర్స్ కొడుతుంది.