విడుదలకు ఇంకో నలభై ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయమే ఉన్నా కుబేరకు సంబందించిన ఆంధ్ర ప్రదేశ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఒకపక్క తెలంగాణ అమ్మకాలు ఊపందుకోగా ఏపి ఇంకా స్టార్ట్ చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఏ నిమిషమైనా పెట్టేస్తారు కానీ అదేదో ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉండాలనేది వాళ్ళ వెర్షన్. 50 రూపాయల టికెట్ హైక్ కోసం వేచి చూడటం వల్లే ఆలస్యం జరిగిందని, జిఓ రాగానే ఆన్ లైన్ సేల్స్ మొదలవుతాయని ట్రేడ్ టాక్. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఫిలిం ఛాంబర్ ద్వారా సంప్రదించారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
నైజాంలో ఎలాగూ మల్టీప్లెక్సులకు గరిష్ట ధర 295, సింగల్ స్క్రీన్లకు 175 రూపాయలు జిఓ అవసరం లేకుండానే పెట్టుకునే వెసులుబాటు ఉంది. కానీ ఏపీలో అంత రేట్లు లేవు. మల్టీప్లెక్స్ 177, సింగల్ స్క్రీన్ 110 నుంచి 148 మధ్యలో ఉన్నాయి. అలాంటప్పుడు కుబేర లాంటి పెద్ద బడ్జెట్ సినిమాకు పెంపు అనివార్యమని ఆసియన్ వర్గాలు అంటున్నాయి. దీనికో నిర్దిష్ట పరిష్కారం తెచ్చే దిశగా ఆ మధ్య ఒక కమిటీ కూడా వేశారు కానీ ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అదే జరిగితే రెండు రాష్ట్రాలకు ఒకే మోడల్ ని అమలు పరిచే అవకాశముంటుంది. కాకపోతే చిన్న బడ్జెట్ సినిమాలకు కొంత ఇబ్బంది కలగొచ్చు.
నెల రోజులుగా డ్రైగా ఉన్న బాక్సాఫిస్ కు కుబేర ఇప్పుడు ఆక్సిజన్ కావాలి. ట్రెండ్స్ చూస్తుంటే ఆడియన్స్ దీని మీద ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే శేఖర్ కమ్ముల ముందు క్లాస్ ఆ తర్వాత మాస్ ని లాగేస్తారు. ఫిదా లాంటివి దీన్ని రుజువు చేశాయి. కుబేరలో స్టార్ పవర్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఎంత కనెక్ట్ అవుతాయనే దాని మీద సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది. 3 గంటల 1 నిమిషం నిడివితో వస్తున్న కుబేరకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ షర్బ్ కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది. చూడాలి ఫలితం ఎలా ఉండబోతోందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates