విశ్వనటుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన `థగ్‌లైఫ్` సినిమాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోని భాషా సంఘాలు హద్దు మీరుతున్నాయని భావిస్తే.. తక్షణమే ఆయా సంఘాల నాయకులపై బలమైన క్రిమినల్ చట్టాలతోపాటు.. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ సినిమాను కర్ణాటకలో ఎవరూ ఆపరాదని కూడా తేల్చి చెప్పింది.
అసలు ఏం జరిగింది?
థగ్ లైఫ్ సినిమా నిర్మాణం తర్వాత.. దీని ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఆయన కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడం తమిళం నుంచే పుట్టిందన్నారు. దీంతో భాషా పరమైన వివాదాలు తెరమీదికి వచ్చాయి. ఏకంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. కమల్‌కు పరిజ్ఞానం లేదన్నారు. ఇక, భాషా సంఘాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశాయి. తర్వాత.. హైకోర్టును ఆశ్రయించాయి.
దీంతో వివాదం ముదిరింది. కమల్ క్షమాపణలు చెబితే సరిపోతుందని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే.. సారీ చెప్పేందుకు కమల్ నిరాకరించారు. దీంతో ఈ సినిమాను కర్ణాటకలో ఆడనిచ్చేది లేదని కన్నడ భాషా సంఘాలు తేల్చిచెప్పాయి. దీంతో కమల్ కూడా.. ఈ సినిమాను కర్ణాటకలో తప్ప అన్ని చోట్లా విడుదల చేస్తామన్నారు. అయితే.. రాజ్‌కమల్ మూవీ సిబ్బంది(కమల్ కు చెందిన సంస్థే) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కర్నాటక భాషా సంఘాలు థగ్‌లైఫ్ సినిమాను అడ్డుకుంటున్నాయని.. ఇది భావప్రకటనాస్వేచ్ఛకు, జీవించే హక్కుకు(ఈ సినిమా ద్వారా కొన్ని వేల మంది ఆధాపడి ఉండడం) విఘాతమని పేర్కొన్నారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు చేసింది. ఏదైనా ఉంటే మాటల ద్వారా తేల్చుకోవాలని.. సెన్సార్ బోర్డు ఒక్కసారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత.. ఎక్కడైనా ఈ సినిమాను ప్రదర్శించే హక్కు నిర్మాణ సంస్థకు ఉంటుందని తేల్చి చెప్పింది. యాగీ చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates