అవార్డులు వచ్చి తీసుకోండి – దిల్ రాజు

నిన్న జరిగిన గద్దర్ అవార్డుల వేడుక విజయవంతంగా జరిగిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎఫ్డిసి చైర్ మెన్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఈవెంట్ కు సంబంధించి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అయితే కొన్ని అవార్డులు తీసుకునేందుకు విజేతలు కాకుండా వాళ్ళ తరఫున ప్రతినిధులు రావడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమైన మాట వాస్తవం. దిల్ రాజు దీని గురించే నొక్కి చెబుతున్నారు. పురస్కారం అందుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే డైరీలో డేట్ నోట్ చేసుకుని రావాలని, ప్రభుత్వంతో ప్రయాణంలో ఇది కూడా ఒక బాధ్యతేనేని గుర్తు చేశారు.

ఆయన చేసిన విన్నపంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తీసుకొచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నంది పేరుతో వీటిని ఇచ్చేవాళ్లు. టాలీవుడ్ ఆస్కార్ రేంజ్ లో ఇవి తీసుకున్న వాళ్లకు గుర్తింపు ఉండేది. అలాంటప్పుడు అందరూ హాజరైతే ఆ కళ వేరుగా ఉంటుంది. కానీ నిన్న కొందరి గైర్హాజరు గవర్నమెంట్ పెద్దల దృష్టిలో రాకుండా పోదు. ఎందుకంటే ఇలాంటి వేడుకలకు శాశ్వతత్వం ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఫలనా గద్దర్ అవార్డు మొదటి ఈవెంట్ ఎలా జరిగిందని వీడియో రూపంలో చూసుకుంటే అది కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలి.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని దిల్ రాజు చెప్పారు. అవి ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతాయా లేక వచ్చే ఏడాది నుంచి ఉంటాయా అనేది చెప్పలేదు కానీ ప్రస్తుతానికి కార్యాచరణ జరుగుతోందనే హింట్ అయితే ఇచ్చారు. వేడుకకు రానివాళ్ళ గురించి ఇప్పుడు చెప్పకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీటయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా అలెర్ట్ చేయడం మంచిదే. ఇకపై గద్దర్ అవార్డులు క్రమం తప్పకుండ జరగబోతున్నాయి. ఏపీలో నంది పేరుతోనే పునఃప్రారంభం కావొచ్చని అంచనా. నిన్న చాలా మంది సీనియర్ స్టార్లు, టయర్ 2 హీరోలు కనిపించకపోవడం కొంత లోటుగానే అనిపించింది.