ఫ్లాష్ బ్యాక్ : ‘పెదరాయుడు’ ప్రభంజనానికి 30 ఏళ్ళు

2025 జూన్ 15 తో ‘పెదరాయుడు’ 30 వసంతంలోకి అడుగు పెట్టింది. కమర్షియల్ హంగులు, డాన్సులు ఫైట్లు, మసాలా దినుసులు రాజ్యమేలుతున్న టైంలో పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ అచ్చ గ్రామీణ సినిమా అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టిన వైనం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఒకసారి ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. 1994. మోహన్ బాబు వరస ఫ్లాపుల్లో ఉన్నారు. అప్పుడే ఆయన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ నుంచి ఫోన్. నాట్టమై అనే కొత్త సినిమా చాలా బాగుందని, వెంటనే రీమేక్ హక్కులు కొనమని చెప్పేశారు. అంతే కాదు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన గెస్ట్ రోల్ తాను చేస్తానని హామీ ఇచ్చేశారు.

ఫ్రెండ్ అంత నమ్మకంగా చెప్పేసరికి మోహన్ బాబు వెంటనే నిర్మాత ఆర్బి చౌదరికి ఫోన్ చేసి రైట్స్ కొనేశారు. రీమేక్ స్పెషలిస్ట్ రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా ఎంచుకుని సత్యమూర్తితో సంభాషణలు రాయించారు. సంగీత దర్శకుడిగా కోటి ఫిక్స్. తమిళ వెర్షన్ లో కొంచెం డ్రామా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించి టాలీవుడ్ ప్రేక్షకులకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలు మార్పు చేశారు. ఒరిజినల్ లో లేని మ్యానరిజం, స్టైల్ ని పాపారాయుడుగా నటించిన రజనీకాంత్ కు జోడించారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే రెండు పాత్రల్లో మోహన్ బాబు తనకు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్ తో వాటిని నిలబెట్టారు. కోటి పాటలు చార్ట్ బస్టరయ్యాయి.

చిరంజీవి బిగ్ బాస్ కు పోటీగా ఒకే రోజు జూన్ 15 పెదరాయుడు రిలీజయ్యింది. అందరూ మోహన్ బాబు రిస్క్ చేశాడనుకున్నారు. తీరా చూస్తే రెండో వారంలోకి అడుగు పెట్టకముందే మెగా మూవీ డిజాస్టర్ కాగా పెదరాయుడుకి బ్రహ్మరథం దక్కింది. సెంటిమెంట్, ఎమోషన్, మ్యూజిక్, మాస్ అన్నీ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఉన్న గ్రామీణ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఘరానా మొగుడు పేరు మీదున్న 10 కోట్ల రికార్డుని దాటేసి 12 కోట్లు వసూలు చేసిన పెదరాయుడు 40 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం నెలల తరబడి చెప్పుకున్నారు. స్నేహితుడి చెప్పిన మాటను విన్న మోహన్ బాబు తన కెరీర్ లోనే గర్వంగా చెప్పుకునే ఇండస్ట్రీ హిట్ సాధించారు.