ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి దొరకడం కలకలం రేసింది. హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లి వద్ద ఒక రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. పోలీసులు రైడ్ చేసి అనుమతి లేని విదేశీ మద్యం, గంజాయిని పట్టుకోవడం.. ఆ పార్టీలో ఉన్న కొందరు గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మంగ్లీ వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. బీఆర్ఎస్, వైసీపీ మద్దతుదారుగా ముద్ర ఉన్న మంగ్లీ ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఐతే ఈ కేసు వ్యవహారం ఇలా ఉండగానే.. ఆమె తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ అవార్డుల వేడుకలో పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు రావడం విశేషం.
ఈ అవార్డుల వేడుక కోసం మంగ్లీ రిహార్సల్స్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. అంటే హైటెక్స్‌లో జరిగే ఈవెంట్లో మంగ్లీ మెరవబోతోందన్నమాట. అంటే ఈ కేసుకి, అవార్డుల వేడుకకు సంబంధం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనుకోవాలి.
ఇంతకుముందు పుష్ప-2 రిలీజ్ టైంలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతణ్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్నారు. కానీ కట్ చేస్తే గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా బన్నీనే ఎంపిక చేశారు. ఇంకోవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో రేవంత్ వెర్సన్ నాగార్జున అంటూ చర్చ జరిగింది. కానీ ఇటీవల మిస్ వరల్డ్ వేడుకల్లో రేవంత్, నాగ్ కలిసి కనిపించారు. గద్దర్ అవార్డుల వేడుకకు కూడా నాగ్ వస్తాడని అంటున్నారు. అంటే రాజకీయాలు వేరు, కళలు వేరు అని రేవంత్ సర్కారు స్పష్టమైన తేడాను చూపిస్తోందని భావించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates