సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రెటీలు చాలా తక్కువమంది. అలా ఉన్న వాళ్లను జనం ఊరికే ఉండనివ్వరు. వాళ్లను నానా మాటలు అని.. సోషల్ మీడియాకు ఓ దండం అనిపించేస్తారు. హరీష్ శంకర్ సహా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఫిలిం సెలబ్రెటీలు చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే చాలామంది సినీ జనాలు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న వాళ్లు కూడా అంత యాక్టివ్‌గా ఉండరు. దీంతో పాటు ఇంకో వర్గం కూడా ఉంటుంది. మారు పేరుతో ఉంటూ సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నింటినీ ఫాలో అవుతుంటుంది ఈ వర్గం.
తాను కూడా ఆ వర్గానికే చెందుతానని అంటున్నారు సీనియర్ నిర్మాత అల్లు అరవింద్. బన్నీ వాసు ప్రత్యేకంగా పెట్టుకున్న నిర్మాణ సంస్థ ‘బన్నీ వాసు వర్క్స్’లో తెరకెక్కిన తొలి చిత్రం ‘మిత్రమండలి’ టీజర్ లాంచ్ ఈవెంట్లో తనకున్న ఫేక్ అకౌంట్ గురించి అరవింద్ వెల్లడించారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక.ఎం ఇటీవల సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ‘పెరుసు’ అనే హిట్ మూవీలో నటించిన నిహరిక తెలుగులో నటించిన తొలి చిత్రం.. మిత్రమండలి. ఆమె గురించి అరవింద్ మాట్లాడుతూ.. తాను నిహారిక ఫాలోవర్ అని, ఆమె వీడియోలు రెగ్యులర్‌గా చూస్తుంటానని తెలిపారు.
దీనికి నిహారిక ఆశ్చర్యపోతుంటే.. తాను ఫేక్ అకౌంట్‌తో ఆమెను ఫాలో అవుతున్నట్లు అసలు విషయం వెల్లడించారు అరవింద్. ఒరిజినల్ పేరుతో అకౌంట్ నడిపితే.. సోషల్ మీడియా జనాలు ఊరుకోరని.. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి, నానా బూతులు తిట్టేస్తారని.. అందుకే ఇలా మారు పేరుతో సోషల్ మీడియాలో ఉంటున్నానని.. ప్రస్తుత ట్రెండ్స్ అన్నీ తనకు తెలుసని అరవింద్ చెప్పారు.
ఇక నిహారిక తన గురించి మాట్లాడుతూ.. ఆమె హృదయంలో తనకు చోటిచ్చినట్లు చెప్పిందని.. అలా అనగానే తన వయసు తగ్గిపోయి చిన్నవాడిని అయిపోయానని అరవింద్ చమత్కరించడం విశేషం. ఎస్కేఎన్, బన్నీ వాసులను తన పిల్లలు అనడం కంటే గీతా ఆర్ట్స్ పిల్లలు అనడం మంచిదని.. తన పిల్లలని పేర్కొంటే ఆస్తిలో వాటాలు అడుగుతారని అరవింద్ మరో పంచ్ విసిరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates