ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి, అనుమతి లేని విదేశీ మద్యం దొరకడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్ట్‌లో మంగళవారం రాత్రి ఈ వేడుకలు జరగ్గా.. పక్కా సమాచారంతో అక్కడ దాడి చేసిన పోలీసులు గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు వెల్లడైంది. పార్టీకి వచ్చిన వారిలో కొందరు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఐతే మీడియాలో ఈ వార్త గురించి రిపోర్ట్ చేస్తూ తన పేరు, ఫొటోలను తప్పుగా చూపిస్తున్నారంటూ నటి దివి ఆవేదన వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా ఇలా తన గురించి నెగెటివ్ న్యూస్ వేస్తే తన కెరీర్‌కు ఎంత ఇబ్బంది అవుతుందో చెబుతూ ఆమె ఒక ఆడియో నోట్ రిలీజ్ చేసింది.
”మీడియా మిత్రులకు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లకు సంబంధించిన తప్పులు అన్నీ తొయ్యడం కరెక్ట్ కాదు కదండీ. మీరు కూడా ఒకసారి చూడండి. అక్కడ మనం కూడా ఏమైనా తప్పులు చేశాం అని ఆధారాలు ఉంటే నా ఫొటో వేస్తే బాగుంటుంది. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫొటో వాడి నెగెటివ్ న్యూస్ రాస్తే నా కెరీర్‌కు ఎంత ఇబ్బంది అండీ.
ఎంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్ బర్త్ డే అంటే వెళ్తారు. అక్కడ ఏమైనా జరిగితే మీది బాధ్యత కాదు కదా. మంగ్లీ కూడా మంచి పేరున్న వ్యక్తి. నాకు స్నేహితురాలు కావడంతో పార్టీకి వెళ్లా అక్కడ జరిగిన దానికి నేను బాధ్యురాలి లాగా నా ఫొటో పెట్టి ఇలా చేయడం చాలా తప్పండీ. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నా” అని దివి పేర్కొంది. పార్టీకి హాజరైన వారిలో దివితో పాటు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, కమెడియన్ రచ్చ రవి తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.