పబ్లిక్ స్టేజి మీద నిజాలతో కూడిన ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం అరుదు. అందులోనూ స్టార్ హీరోల నుంచి వీటిని ఆశించడం తక్కువ. ఇవాళ ముంబైలో జరిగిన కుబేర సాంగ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మేమెవ్వరం రెండు మూడు వేల కోట్ల హీరోలం కాదని, రష్మిక మందన్న మాత్రం ఆ క్లబ్బులో చేరిపోయిందని యానిమల్, పుష్ప 2, చావాలను ఉద్దేశించి చెప్పడంతో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కుబేర గురించి చెబుతున్న క్రమంలో శేఖర్ కమ్ములతో పని చేయడానికి 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సినిమాతో అది నెరవేరిందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు.
ధనుష్, రష్మిక మందన్నలు సైతం బోలెడు కబుర్లు పంచేసుకున్నారు. ఏడు గంటల పాటు డంప్ యార్డ్ లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రష్మిక చాలా సులభంగా తట్టుకుందని, ఆమెకు వాసన రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పిన ధనుష్ కుబేర కోసం ఎలాంటి పరిశోధన చేయలేదని, శేఖర్ కమ్ముల ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్లిపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నారు. మాములుగా కొందరు హీరోలు బిచ్చగాడి పాత్ర చేయాల్సి వచ్చినపుడూ వాళ్ళను కలిశామని, కొన్ని రోజులు వీధుల్లో తిరిగామని ఏవేవో అల్లేస్తారు. దానికి భిన్నంగా ధనుష్ ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం విశేషం.
విలన్ జిమ్ షర్బ్ గురించి నాగార్జున ప్రత్యేక ప్రశంసలు అందించడం గమనార్హం. తనకంటే తెలుగు బాగా మాట్లాడాడంటూ ప్రత్యేక కితాబు ఇచ్చేశారు. ఒకప్పుడు శివ లాంటి క్లాసిక్స్ ని బాలీవుడ్ కిచ్చిన నాగార్జున మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారనే ప్రశ్నకు సమాధానంగా కుబేరతో పాటు కూలి హిందీలో వస్తున్నాయని, ఇప్పుడు బాషా భేదాలు లాంటివి లేకుండా అన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని బదులు చెప్పారు. క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఏదీ రివీల్ చేయలేనని, సినిమా చూశాక తెలుసుకుంటారని చెప్పిన నాగార్జున ఆద్యంతం మంచి హుషారుగా కనిపించారు. జూన్ 20 కుబేర ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.