ఇంకో పదకొండు రోజుల్లో విడుదల కాబోతున్న కుబేర కోసం అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ధనుష్, నాగార్జున కలయికలో రూపొందిన ఈ మల్టీస్టారర్ లో రష్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద ఇప్పటికే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. మరీ పుష్ప రేంజ్ లో కాదు కానీ రిలీజయ్యాక ఇంకా బాగా కనెక్టవుతాయనే అభిప్రాయం మ్యూజిక్ లవర్స్ లో ఉంది. అయితే కుబేరకి సంబంధించి ఇంకొంత వర్క్ పెండింగ్ ఉంది. దేవి పనిచేయాల్సిన బ్యాలన్స్ పూర్తవ్వలేదు. కానీ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ చేసుకున్న ఒప్పందం ఖచ్చితంగా జూన్ 20నే రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రిక్వెస్ట్ చేసినా పనవ్వలేదు. ఒకవేళ జూలైకి వాయిదా వేయాలంటే ఏకంగా 10 కోట్లు తగ్గిస్తామని చెప్పడంతో వేరే మార్గం లేక ఆఘమేఘాల మీద కుబేరని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా సునీల్ స్వయంగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడంతా ఓటిటిలు ఎలా ఆడమంటే అలా ఆడే పరిస్థితి వచ్చిందని, ఇంతకు ముందులా థియేటర్ బిజినెస్ ని నమ్ముకునే స్టేజి లేదంటున్న ఈ అగ్ర నిర్మాత కుబేర సైతం దీనికి మినహాయింపు కాలేదని చెప్పుకొచ్చారు. సినిమాలో విషయం ఉంటే ఎలా అయినా ఆడుతుందని కుబేర కూడా మెప్పిస్తుందని అన్నారు.
సో ఇంత ఓపెన్ గా ఒక టాప్ ప్రొడ్యూసర్ ఓటిటిల పోకడ గురించి చెప్పడం విశేషమే. పెద్ద సినిమాల థియేటర్ రిలీజ్ డేట్లు డిజిటల్ కంపెనీల అగ్రిమెంట్ల ప్రకారమే ఉంటున్నాయని గత ఏడాదికి పైగా వినిపిస్తూనే ఉంది. కానీ ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడింది లేదు. సునీల్ నారంగ్ మాత్రం చాలా స్పష్టతతో ఉన్నారు. సినిమా ఫలితాలు ఎవరూ ముందే ఊహించలేమని, క్యూబ్ ఓటిటిల మీద అతిగా ఆధారపడటం మొదలయ్యాక బిజినెస్ స్వరూపమే మారిపోయిందని, ఎవరినీ నిందించలేని దీనస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చారు. టాలీవుడ్ ప్రయాణం ఏ దిశగా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.