మూడు సినిమాలు, క్యామియో చేసిన మరో మూవీ ఇలా వరసగా అన్నీ హిట్టయిన హీరోగా నితిన్ నార్నె మంచి ఊపులో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది బ్రాండ్ తో వచ్చినప్పటికీ కొంచెం కొత్తగా ఆలోచిస్తూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లతో బండి లాగిస్తున్నాడు. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ తో పాటు అతిథిగా కనిపించిన సింగిల్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ఫలితాలు అందుకున్నవే. నటన పరంగా ఇంకా మెరుగు పడే స్టేజిలో ఉన్న ఈ కుర్రాడి మొదటి చిత్రం వీటిలో ఏదీ కాదు. శ్రీశ్రీశ్రీ రాజావారుని ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలుపెట్టి ఓ రెండు సంవత్సరాలు ల్యాబులో పెట్టి ఇటీవలే రిలీజ్ చేసి థియేటర్లకు తీసుకొచ్చారు.
ఈ సినిమా ప్రమోషన్లకు నితిన్ నార్నె ముందు నుంచి దూరంగానే ఉన్నాడు. దర్శకుడు సతీష్ వేగ్నేశ టీమ్ తో పాటు ఆర్టిస్టు రావు రమేష్ ని వెంటేసుకుని ఓ రెండు ఇంటర్వ్యూలు చేశారు అవేవి పనవ్వలేదు. అసలిది రిలీజైన సంగతే జనాలకు రిజిస్టర్ కాలేదు. శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు సినిమా తీసిన డైరెక్టర్ కి ఇలాంటి రెస్పాన్స్ రావడం విచిత్రమే. విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటున్న ఓ కుర్రాడు ప్రేమ కోసం దాన్ని మానేయాల్సిన ఛాలెంజ్ స్వీకరిస్తే ఏమవుతుందనే పాయింట్ చుట్టూ శ్రీశ్రీశ్రీ రాజావారు తిరుగుతుంది. ఆ మధ్య కార్తికేయ ఇదే తరహాలో 90 ఎంఎల్ చేసి దెబ్బ తినడం ఆడియన్స్ కి గుర్తే.
మొత్తానికి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు కొనసాగిస్తూ వచ్చిన నితిన్ నార్నె కెరీర్ లో మొదటి భారీ ఫ్లాపు అఫీషియల్ గా రికార్డు అయిపోయింది. వాస్తవానికి ఇది రిలీజ్ కాకూడదనే తను కోరుకున్నాడట. రిజల్ట్ ముందే ఊహించి పబ్లిసిటీకి దూరంగా ఉండటానికి కారణం అదే కావొచ్చు. అయినా తొలి సినిమా ఎంపికలో కుర్రాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో చెప్పడానికి శ్రీశ్రీశ్రీ రాజావారు మంచి ఉదాహరణ. దీనికి ఎంత వీక్ ఓపెనింగ్ వచ్చిందంటే మొదటి రోజే కొన్ని చోట్ల అన్ని షోలు వేయలేకపోయారు. జనం లేక క్యాన్సిలైన బాపతే ఎక్కువట. కంటెంట్ బాలేకపోతే కమల్ కే తిరస్కారం తప్పలేదు. ఇక నితిన్ నార్నె ఎంత.