ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీగా నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ఎంబి అప్డేట్స్ ఈ మధ్య ఆగిపోయాయి. మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ మీద షూట్ చేసిన ఒక సీన్ తాలూకు వీడియో లీకయ్యాక జక్కన్న మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు బ్రేక్ ఇచ్చారు లాంటి వివరాలు వీలైనంత వరకు బయటికి రాకుండా చూస్తున్నారు. ఇదిలా ఉండగా కీలకమైన మహేష్ తండ్రి క్యారెక్టర్ కు బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ని అడిగారనే వార్త రెండు రోజులుగా ముంబై వర్గాల్లో వినిపిస్తోంది. ఇరవై కోట్లు ఆఫర్ చేసినా ఆయన మొహమాటం లేకుండా సున్నితంగానే నో చెప్పారని వాటి సారాంశం.
దీన్ని కాసేపు నిజమే అనుకుంటే ఇంతకన్నా బ్యాడ్ డెసిషన్ ఈ విలక్షణ నటుడి కెరీర్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటీవలే విడుదలైన హౌస్ ఫుల్ 5 అనే అర్థం పర్థం లేని బూతుల సినిమాలో నటించిన నానాజి ఆ కథలో ఏం కామెడీ కనిపించిందో, తానే చేసి తీరాలనే ఆలోచన ఎందుకు కలిగిందో కానీ ఇప్పుడా చిత్రమే తీవ్ర విమర్శలకు లోనవుతోంది. హౌస్ ఫుల్ సిరీస్ లో గతంలో నటించి ఉండొచ్చు కానీ ఇంత వరస్ట్ సబ్జెక్టుతో తన దగ్గరికి వచ్చినప్పుడు నో చెప్పాలి కదా. రాజమౌళి లాంటి విఖ్యాత దర్శకుడు అడిగాడంటే పాత్ర ఖచ్చితంగా చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. వదులుకోవడం కరెక్ట్ కాదు.
దీని గురించి సరైన స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఎక్కువ బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చే నానా పాటేకర్ చాలా అరుదుగా సౌత్ లో కనిపిస్తారు. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అర్జున్ రానాలో నటించాక రజనీకాంత్ కాలాలో మెయిన్ విలన్ గా దర్శనమిచ్చాడు. ఇప్పుడు జక్కన్న మూవీలో చేసి ఉంటే మరో మైలురాయి తోడయ్యేది. ఇదంతా అధికారికంగా బయటికి వచ్చింది కాదు కాబట్టి నిజమో కాదో నిర్ధారణ కావాలంటే ఏదో ఒక మీడియా మీట్ లో నానాజీ దొరకాలి. ఈయన సంగతి ఎలా ఉన్నా మాధవన్ ఒక ముఖ్యమైన పాత్ర కోసం లాకయ్యాడని ఫ్రెష్ అప్డేట్. ఇది కూడా లీకుల రూపంలో వచ్చిందే.