బైక్ ఛేజింగ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ కి శ్రీకారం చుట్టిన సినిమాగా ధూమ్ కు బాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ భారీ ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి రెండు భాగాల్లో నటించిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ కు వచ్చిన పేరు చూసి థర్డ్ పార్ట్ అమీర్ ఖాన్ ఏరికోరి మరీ నటించాడంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా జరిగి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 2013లో ధూమ్ 3 రిలీజయ్యాక మళ్ళీ కొనసాగింపు గురించి ఎలాంటి వార్తలు రాలేదు. ఇప్పుడా దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. ప్రస్తుతం వార్ 2 తీస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఆ బాధ్యతలు ఇస్తున్నట్టు ముంబై రిపోర్ట్.
నిజానికి వార్ 2 కాగానే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 తీయాలి. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ కేటాయించలేమని, ఇంకొంత సమయం తీసుకుందామని నిర్మాత కరణ్ జోహార్ ప్రతిపాదించడంతో దాని స్థానంలో యష్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ 4కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మెయిన్ లీడ్ గా రన్బీర్ కపూర్ ఎప్పుడో ఓకే చెప్పాడు. కథ పూర్తిగా వినకుండానే అయాన్ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదంతా యానిమల్ టైంలోనే జరిగింది. ఇప్పుడు రన్బీర్ కు పెరిగిన ఇమేజ్ దృష్ట్యా ధూమ్ 4 కనక చేస్తే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. అందుకే ఈ కాంబో మీద వర్క్ జరుగుతోందని సమాచారం.
అసలు దీనికన్నా ముందు అయాన్ ముఖర్జీ వార్ 2తో ప్రూవ్ చేసుకోవాలి. టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లని చూపించిన విధానం, విఎఫ్ఎక్స్ లోపాలు అతని మీద క్రిటిసిజం తీసుకొచ్చాయి. వాటిని పోగొట్టుకుని బ్లాక్ బస్టర్ సాధిస్తేనే అయాన్ మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చనే నమ్మకం మరింత పెరుగుతుంది. వార్ 2, ధూమ్ 4 నిర్మాత ఒకరే కాబట్టి రెండు పరస్పరం ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం రన్బీర్ కపూర్ రామాయణం, లవ్ అండ్ వార్ తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం వీటికే గడిచిపోయేలా ఉంది. నెక్స్ట్ ధూమ్ 4 ఉంటుంది. కాకపోతే ఎక్కువ సమయం పట్టేలా ఉంది కాబట్టి లాంగ్ వెయిటింగ్ తప్పదు.