లోక నాయకుడు కమల్ హాసన్ ఎంతో ఉత్సాహంగా ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆయనకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. చెన్నైలో ఈ సినిమా తమిళ ఆడియో రిలీజ్ వేడుకలో కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాష కూడా తమిళం నుంచే వచ్చిందంటూ చేసిన వ్యాఖ్య కన్నడిగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కమల్ ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో రిలీజ్ కానివ్వబోమంటూ అక్కడి ఫిలిం ఛాంబర్‌తో పాటు కన్నడ భాషా సంఘాలు తెగేసి చెప్పాయి.
కానీ కమల్ మాత్రం సారీ చెప్పడానికి ససేమిరా అన్నారు. తన సినిమాకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయిస్తే అక్కడా ఎదురు దెబ్బ తప్పలేదు. సారీ చెప్పి సినిమాను సాఫీగా రిలీజ్ చేయించుకోండి అని కోర్టు తేల్చి చెప్పింది. కానీ కమల్ అప్పటికీ సారీ చెప్పడానికి సిద్ధపడలేదు. నష్టం వచ్చినా పర్వాలేదని, కర్ణాటకలో తన సినిమాను రిలీజ్ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల కమల్‌కు రూ.12 కోట్ల నుంచి 15 కోట్ల దాకా నష్టం వాటిల్లబోతున్నట్లు సమాచారం. ఒక్క సారీ చెప్పడానికి ఇంత పంతమేంటి అని కొందరంటుంటే.. ఆత్మాభిమానం ముందు డబ్బు ముఖ్యం కాదని కమల్ తీసుకున్న నిర్ణయం భేష్ అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు తమిళులు. ఈ క్రమంలోనే నిన్నట్నుంచి ‘ఐ స్టాండ్ విత్ కమల్ హాసన్’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు. అంతే కాక.. కమల్‌కు తమ వంతుగా చేయాల్సిన సాయం చేస్తామని వారంటున్నారు.
ఇందుకోసం ఒక్కొక్కరు వీలైనంత ఎక్కువ సార్లు ‘థగ్ లైఫ్’ సినిమా చూస్తారట. తమ చుట్టూ ఉన్న వాళ్లతో కూడా ఈ సినిమా చూపిస్తారట. అలా కర్ణాటకలో కోల్పోయిన ఆదాయాన్ని మించి ‘థగ్ లైఫ్’ టీంకు తాము అందిస్తామని.. కమల్ బాధ పడాల్సిన పని లేదని తమిళ నెటిజన్లు అంటున్నారు. ‘థగ్ లైఫ్’ సినిమాను కమలే స్వయంగా నిర్మించారు. దర్శకుడు మణిరత్నం కూడా ఇందులో భాగస్వామే అయినా.. ఎక్కువ పెట్టుబడి కమలే పెట్టారు. మరి కర్ణాటకలో కమల్ కోల్పోతున్న ఆదాయాన్ని తమిళ జనాలు ఎంతమేర భర్తీ చేస్తారో చూడాలి.