ఒకపక్క కమల్ హాసన్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ తన సినిమా విడుదలకు ఆటంకాలు లేకుండా చూడమని కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఇంకోవైపు దీని మీద నిషేధం విధించిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ పెద్దలు మరోసారి సమావేశం జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారు. సాంకేతికంగా చూస్తే థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడం చట్ట సమ్మతం కాదు. ఒకవేళ న్యాయస్థానం కనక పోలీసుల పహారాలో రిలీజ్ చేయమని తీర్పు ఇస్తే దాన్ని ధిక్కరించే సాహసం ఎవరూ చేయలేరు. కాకపోతే థియేటర్లలో ఉద్రిక్త సంఘటనలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. నిరసనకారులు ఆ దిశగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కోర్టు కనక కమల్ హాసన్ ని క్షమాపణ చెప్పమని కోరితే కథ సుఖంతమవుతుంది. న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దానికి అవకాశం లేదు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వీడియో సాక్షిగా కమల్ చెప్పారు కాబట్టి ఆ స్టేట్ మెంట్ ని సమర్థిస్తూ ఆధారాలు ఉంటే చూపమని అడగొచ్చట. అవి చూపించని పక్షంలో సారీకి ఆదేశాలు జారీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నేనేం తప్పు చేయలేదు అంటున్న కమల్ హాసన్ మరి కన్నడ తమిళం నుంచి ఎలా పుట్టిందనే దానికి వివరణ ఇవ్వడం లేదు. వివాదం అంతకంతా ముదిరిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఎల్లుండి రిలీజ్ కాబోతున్న థగ్ లైఫ్ కు ఈ కాంట్రావర్సి తీవ్ర సమస్యగా మారింది. ఒక్క థియేటర్ లో రిలీజ్ చేసినా లోపలికి వెళ్లి ధ్వంసం చేస్తామని పలు సంఘాలు హెచ్చరించడంతో ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. పోలీసులని కాపలాగా పెట్టినా ప్రేక్షకులు రావడానికి భయపడతారని, కన్నడ మద్దతుదారులు ఎలాగూ సినిమాకి రారని అలాంటప్పుడు బలవంతంగా వేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంకో 48 గంటల సమయం మాత్రమే ఉండటంతో ఈ పరిణామాలు శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనను అభిమానించే కన్నడ ఫ్యాన్స్ సైత నిరసన గళం వినిపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates