సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడతారనే పేరుండేది. రాజకీయ అంశాల మీద కూడా పక్షపాతం లేకుండా మాట్లాడతారనే గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి.. గత కొన్నేళ్లలో మాత్రం మారిపోయారు. ఉన్నట్లుండి వైఎస్ జగన్ సపోర్టర్‌గా మారిపోయిన నారాయణమూర్తి.. ఆయన ఏం చేసినా సూపర్ అనడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా జగన్ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలూ మొదలుపెట్టేశారు. ఇటీవల ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రతినిధులు వచ్చి ఏపీ సీఎంను మర్యాదపూర్వకంగా కలవాల్సిందని పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
థియేటర్ల వ్యవస్థ మీద పవన్ దాడి చేయిస్తున్నారంటూ విమర్శలు చేయించారు. దీనిపై నిర్మాత నట్టికుమార్ తాజాగా నారాయణమూర్తికి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ రోజు థియేటర్ల మీద ఏదో దాడి జరిగిపోతున్నట్లు మాట్లాడుతున్న నారాయణమూర్తి.. జగన్ ప్రభుత్వ హయాంలో పవన్ సినిమాలు రిలీజైనపుడు కక్షగట్టి రేట్లు తగ్గిస్తే, థియేటర్లను మూయిస్తే ఆయన ఏం చేస్తున్నారని నట్టికుమార్ ప్రశ్నించారు. ఎమ్మార్వోలను థియేటర్ల దగ్గర పెట్టించి 5 రూపాయలు, 10 రూపాయలకు టికెట్లు అమ్మించారని.. అప్పుడు ఇది అన్యాయం కదా అని నారాయణమూర్తి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నట్టికుమార్ అన్నారు.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కారణాలు చెప్పి 130 థియేటర్ల దాకా మూయించారని.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేయం అని చెబితే వాటిని ఓపెన్ చేయిస్తామని బెదిరించారని.. కావాలంటే ఆ థియేటర్ల లిస్టు ఇస్తానని నట్టికుమార్ అన్నారు. మరి ఆ అన్యాయం గురించి నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం టికెట్ల ధరల పెంపు మీద నారాయణమూర్తి ఎందుకు ప్రశ్నించడం లేదని.. పాప్ కార్న్ ధరను రూ.300 పెట్టడాన్ని ఆయన సమర్థిస్తారా అని నట్టికుమార్ ప్రశ్నించారు.
థియేటర్లలో మెయింటైనెన్స్ సరిగా లేకపోవడం.. క్యాంటీన్ ధరలు ఎక్కువ ఉండడం మీద పవన్ కళ్యాణ్ అధికారులతో తనిఖీలు చేయిస్తుంటే అది నారాయణమూర్తికి తప్పుగా అనిపిస్తోందా అన్నారు. జగన్ హయాంలో ఎన్నో ఘోరాలు జరిగినా మౌనంగా ఉన్న నారాయణమూర్తి.. ఇప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ మీద అనవసర విమర్శలు చేస్తున్నారని.. ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత పవన్‌ను ప్రశ్నించాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates