సమయం ముంచుకొస్తోంది హరిహరా

జూన్ వచ్చేసింది. ఇంకో పన్నెండు రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఇప్పటిదాకా ట్రైలర్ అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. కనీసం రెండు వారాల ముందు వదిలితే ప్యాన్ ఇండియా బిజినెస్ పరంగా ఉపయోగడుతుందనే వాళ్ళ పాయింట్ కరెక్టే. కానీ నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ బిజీగా ఉండటం వల్ల ఏదైనా అడుగుదామంటే మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. చేతిలో ఉన్నది చాలా అంటే చాలా తక్కువ సమయం. అసలు ఫైనల్ కాపీ చేతికి వచ్చిందో లేదో తెలియదు. సెన్సార్ కోసం ఏ డేట్ అడిగారో క్లారిటీ లేదు. మొత్తానికి సందిగ్దత నెలకొంది.

తెల్లవారుఝామున స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఖాయమైనట్టే. కానీ ఫ్యాన్స్ దాని కన్నా ముందు కోరుకుంటున్నది అమాంతం హైప్ పెరగడం. ఇప్పటిదాకా వచ్చిన పాటలు ఆ పనిని చేయలేదు. ఆస్కార్ విజేత కీరవాణి ఏదో అద్భుతం చేస్తారనుకుంటే యావరేజ్ సాంగ్స్ ఇచ్చారని ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు. సాలిడ్ ట్రైలర్ ఒకటి పడితే తప్ప ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. సిజి వర్క్ పూర్తి చేసుకుని తుది కాపీ రేపో ఎల్లుండో వస్తుందని అప్పుడు ట్రైలర్ పనులు కొలిక్కి వస్తాయని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే మొదటి వారం చివరన ఆశించడం తప్ప ఏం చేయలేం.

బజ్ సంగతి ఎలా ఉన్నా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వర్గాలు హరిహర వీరమల్లు కోసం ఎదురు చూస్తున్నాయి. రోజు మొత్తం షోలన్నీ హౌస్ ఫుల్ చేసే కెపాసిటీ ఉన్న స్టార్ హీరో సినిమాలు వచ్చి వారాలు గడిచిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత సునామి దేనికి కనిపించలేదు. హిట్ 3 సైతం మొదటి వీకెండ్ కాగానే నెమ్మదించేసింది. సో హరిహర వీరమల్లు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లకు రెండు మూడు వారాలు కళకళలాడతాయని ఎదురు చూస్తున్నారు. సో ఇకపై మెట్రో స్పీడ్ తో దూసుకుపోతేనే వీరమల్లుకు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరుగుతాయి. చూడాలి మరి ఏం చేస్తారో.