కమర్షియల్ ప్రపంచానికి దూరంగా అభ్యుదయ సినిమాలు మాత్రమే తీసే పీపుల్స్ స్టార్ గా ఆర్ నారాయణమూర్తి గారంటే ప్రేక్షకుల్లోనూ కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు గౌరవముంది. కోట్ల రెమ్యునరేషన్ ఇస్తాం సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేయండని పూరి జగన్నాథ్ లాంటి అగ్ర దర్శకులు అడిగినా నో చెప్పిన మనస్తత్వం ఆయనది. తాను నమ్ముకున్న సిద్ధాంతంని తూచా తప్పకుండ పాటించే వ్యక్తిగా ఆయన స్థానం విశిష్టం. ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులకు కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ఇండస్ట్రీ మొత్తం చర్చగా మారిన సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ విధానం గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. కూటమి ఏర్పడ్డాక ఏపీ ముఖ్యమంత్రిని టాలీవుడ్ ప్రతినిధులు ఎవరూ కలవలేదని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. మీరు రాజులు కాబట్టి చెప్పినట్టే చేస్తాం, కానీ ఒకప్పుడు ప్రభువులు ప్రజల దగ్గరికి వెళ్లి కష్టాలు వినేవాళ్లని, మీరు గెలిచిన తర్వాత అదే తరహాలో మమ్మల్నిపిలిచి ఇండస్ట్రీ సమస్యలు విని ఉంటే బాగుండేదని సున్నితంగా చురకలు వేశారు. అయితే మూర్తిగారి మీద గౌరవంతోనే ఫ్యాన్స్ కొన్ని లాజిక్స్ తీస్తున్నారు. అడగందే అమ్మయినా పెట్టదనేది అందరికి తెలిసిన నానుడి. అలాంటిది ఏదీ చెప్పకుండా పరిశ్రమలో సమస్యలన్నీఈ పవన్ కు ముందే తెలుస్తాయని అనుకోవడం సరికాదుగా .
పైగా పవన్ సినిమాటోగ్రఫీ మంత్రి కాదు. డిప్యూటీ సిఎం బాధ్యతతో పాటు కీలక మినిస్ట్రీలు అయన కింద ఉన్నాయి. వాటిలో నారాయణమూర్తి గారు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే అటవీ, గ్రామీణాభివృద్ధి కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టడం భావ్యం కాదు. నిజంగా టాలీవుడ్ కు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సీఎం చంద్రబాబునో లేదా పవన్ నో సినీ ప్రతినిధులు వెళ్లి కలవడం నేరమూ, తప్పూ కాదు. పైగా వ్యాపారంతో ముడిపడిన సినిమా రంగానికి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ ఇటీవల కూడా చెప్పారు. అలాంటప్పుడు అదేదో రాజుల మాదిరి దర్పం చూపిస్తున్నారని చెప్పడం భావ్యం కాదనేది అభిమానుల కౌంటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates