=

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం బల్క్ డేట్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2023లో రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ముందు పక్కన పెట్టిన మూడు చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఆయన మళ్లీ అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ముందుగా హరిహర వీరమల్లును పూర్తి చేసిన ఆయన తర్వాత ‘ఓజీ’ని టేకప్ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా షూట్ వేగంగా సాగుతోంది. ‘ఉస్తాద్..’ షూట్ ఇప్పట్లో ఉండదని అనుకున్నారు కానీ.. ఆ చిత్రాన్ని కూడా జూన్‌లో తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పవన్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే చకచకా షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ డేట్లు ఇవ్వడమే మహా భాగ్యం కాబట్టి మిగతా ఆర్టిస్టులవి బల్క్ డేట్స్ తీసుకునే పనిలో పడింది చిత్ర బృందం.

తన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటి కావడంతో శ్రీలీల ‘ఉస్తాద్..’ కోసం పెద్ద మొత్తంలో డేట్లు ఇచ్చేసిందట. ఆమె తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిస్తున్నప్పటికీ పవన్ సినిమాకు ప్రయారిటీ ఇచ్చి కోరినన్ని డేట్లు ఇచ్చేసినట్లు సమాచారం. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీలీలకు వచ్చిన పెద్ద అవకాశం ఇది. కానీ కొన్ని రోజుల షూట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత రెండేళ్ల పాటు ఈ సినిమాకు దూరంగా ఉందామె.

ఎట్టకేలకు జూన్‌లో సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అవుతుండడంతో కోరినన్ని డేట్లు ఇచ్చేసిందట. మిగతా ముఖ్య ఆర్టిస్టులందరూ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చేయనున్నారు. పవన్ పరిమిత సంఖ్యలోనే డేట్లు ఇచ్చినా.. అందరినీ అందుబాటులో ఉంచుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ అండ్ టీం ఏర్పాట్లు చేసుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.