లెజెండరీ సెలబ్రిటీలు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా అందులోని అర్థం సరిగా కన్వే కాకపోతే అపార్థంగా మారిపోతుంది. ఇది ఎన్నోసార్లు చూశాం. తాజాగా ఇసైజ్ఞాని ఇళయరాజా ఉదంతం చూస్తే అదే అనిపిస్తుంది. రేపు విడుదల కాబోతున్న షష్ఠిపూర్తికి ఆయన సంగీతం అందించారు. సాధారణంగా ప్రమోషన్ల దూరంగా ఉండే మాస్ట్రో దీనికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా అంత గొప్ప వారు ఎవరూ లేరనే స్థాయిలో ఆయనన్న మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కావాలంటే ఎవరితో అయినా పోల్చి చూడండని చెప్పడం గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి.
అసలు ఇంతకీ ఇళయరాజా ఉద్దేశమేంటో అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కుగ్రామం నుంచి వచ్చి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా, ఏ సంగీత దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకుండా, ఇంత స్థాయికి రావడం తన విషయంలో జరిగిందని, ఎంఎస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళు సైతం మహామహుల దగ్గర పని చేశాకే తమదైన ముద్ర వేశారని, కానీ నేను మాత్రం అలా కాదని ఇళయరాజా చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన అన్నది ఎవరి చేయూత లేకుండా నేను పైకి వచ్చానని. అలా నా ముందు నా తర్వాత ఎవరూ లేరనేది సారాంశం. కానీ తెలుగులో దాన్ని వ్యక్తపరిచే తీరులో బాష ఇబ్బంది వల్ల మీనింగ్ మారిపోయింది.
ఇదేదో ఇళయరాజాని సమర్ధించే ప్రయత్నం కాదు. ఎవరైనా సరే సపోర్ట్ లేకుండా కూడా కష్టపడి పైకి రావొచ్చనేది ఇళయరాజా చెప్పాలనుకున్న అసలు మాట. గతంలో నేనింకా బెస్ట్ ఇవ్వలేదు, నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ వినయంగా చెప్పుకోవడం ఇలాంటి వేదికల్లోనే చూశాం. ఇప్పుడేదో అహంకారపూరితంగా మాట్లాడతారనుకోవడం సరికాదనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు అద్భుతమైన ఆల్బమ్స్ తో మర్చిపోలేని పాటలు ఇచ్చిన ఇళయరాజా ఇప్పుడా స్థాయిలో కంపోజ్ చేయకపోయినా మంచి సాంగ్స్ అయితే ఇస్తున్నారు. మరి తాజాగా జరిగింది అర్థమో అపార్థమో ప్రేక్షకులే గుర్తించాలి.