డేంజర్ గేమ్ ఆడుతున్న ఆమిర్ ఖాన్

థియేటర్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అమీర్ ఖాన్ చేయబోతున్న సాహసం ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ ఆయన ఏ ఓటిటికి అమ్మరట. ఎనిమిది వారాల తర్వాత నేరుగా యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది రెండు వారాల క్రితమే వచ్చిన న్యూసే అయినా ఇప్పుడు ఖరారుగా ఫిక్సయినట్టుగా అమీర్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే ఒక నిర్మాతగా అమీర్ ఖాన్ చాలా డేంజరస్ గేమ్ ఆడబోతున్నాడు.

ఎందుకంటే ఓటిటిలతో పోలిస్తే యూట్యూబ్ పైరసీ చేయడం కొంత తేలికని అధిక శాతం నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి ఇంటర్నేషనల్ ఓటిటిలే పైరసీని కట్టడి చేయలేక సైలెంటయ్యాయి. అలాంటిది ఒక ప్రీమియం అకౌంట్ తో యూట్యూబ్ ని హ్యాక్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. సరే డబ్బులు కట్టి అక్కడ చూస్తారు అనుకున్నా రెండు నెలల పాటు జనం వేచి చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇటీవలి కాలంలో హెచ్డి ప్రింట్లు మొదటి రోజే ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ కి ఈ బెడద తీవ్రంగా ఉంది. తర్వాత తెలుగు తమిళ సినిమాలకు పాకింది.

వీటికి కట్టడి చేయడం అమీర్ ఖాన్ వల్ల అయ్యేపని కాదు. అలాంటప్పుడు ఏదైనా ఓటిటికి మంచి రేటుకి ఇచ్చేస్తే టెన్షన్ ఉండేది కాదన్నది ఒక కామెంట్. ఎందుకంటే ఆఫర్స్ అయితే క్రేజీగా వచ్చాయి. కానీ సితారే జమీన్ పర్ కంటెంట్ మీద ప్రేమ, నమ్మకంతో ఆ హక్కులను ఎవరికి ఇచ్చే ఉద్దేశంలో అమీర్ ఖాన్ లేడు. ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే లెక్క చేయడం లేదు. జూన్ 20 నుంచి సీన్ మారిపోతుందని, తారే జమీన్ పర్ ని మించిన ప్రశంసలు దీనికి దక్కుతాయని అంటున్నాడు. అదే నిజమవ్వాలని బయ్యర్ల కోరిక. ఎందుకంటే చావా తర్వాత ఉత్తరాది థియేటర్లకు అంత జోష్ ఇచ్చిన బాలీవుడ్ మూవీ లేదు.