నాయగన్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటి. ‘టైమ్’ సంస్థ ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంద చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్న ఘనత ఈ సినిమా సొంతం. అంత గొప్ప సినిమాను అందించిన మణిరత్నం, కమల్ హాసన్ జోడీ నుంచి 37 ఏళ్ల పాటు మరో సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎట్టకేలకు వీరి కలయికలో ‘థగ్ లైఫ్’ రాబోతోంది. జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండగా.. ఈ సినిమా కథ గురించి దర్శకుడు మణిరత్నం ఆసక్తికర విషయం వెల్లడించారు. దీనికి మూల కథ రాసింది కమల్ హాసనేనట. ఆయన కథను తాను మార్చి ‘థగ్ లైఫ్’గా తీసినట్లు ఆయన తెలిపారు.
కమల్ ‘అమర్ హై’ పేరుతో రాసిన ఓ స్క్రిప్టును కొన్నేళ్ల ముందు తాను చదివానని.. అందులో ఒక పాయింట్ తనకు బాగా నచ్చిందని మణిరత్నం తెలిపారు. ఆ పాయింట్ పట్టుకుని.. దానికి ‘నాయగన్’ తరహా ట్రీట్మెంట్ ఇచ్చి ‘థగ్ లైఫ్’ కథను తీర్చిదిద్దినట్లు మణిరత్నం వెల్లడించారు. కాబట్టి ఈ సినిమాకు మూల కథ క్రెడిట్ కమల్‌కే దక్కుతుందని ఆయన తెలిపారు. సినిమాలో ‘నాయగన్’ ఛాయలు ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పేశారు.
కమల్ గొప్ప నటుడే కాదు.. మేటి రచయిత, దర్శకుడు కూడా. ‘దశావతారం’, ‘ఉత్తమ విలన్’ సహా పలు చిత్రాలకు ఆయన కథ అందించారు. ‘హేరామ్’,‘విశ్వరూపం’ సహా కొన్ని చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఐతే మణిరత్నం లాంటి మేటి దర్శకుడికి కమల్ కథ నచ్చి.. ఈ దశలో ఆయన్ని మళ్లీ డైరెక్ట్ చేయడం విశేషమే. ఈ చిత్రంలో శింబు కమల్‌కు దీటైన పాత్రలో నటించాడు. త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కమల్, మణిరత్నం కలిసి ప్రొడ్యూస్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates