మొన్న అల్లు అరవింద్.. నిన్న దిల్ రాజు.. ఇలా వరుసగా రోజుకో అగ్ర నిర్మాత ప్రెస్ మీట్లు పెట్టి మీడియాకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. టాలీవుడ్ పెద్దల తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీలో బాగానే కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఐతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన థియేటర్ల అంశం మీదే కాక అరవింద్, దిల్ రాజు అనేక అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో దిల్ రాజు.. తన ప్రొడక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి పైరసీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా తొలి రోజే హెచ్డీ పైరసీ ప్రింట్‌తో బయటికి రావడం కలకలం రేపింది. క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్లోకి రావడంలో పెద్ద కుట్ర జరిందనే ఆరోపణలు వినిపించాయి.
ఐతే స్వయంగా దిల్ రాజే ఈ పని చేసినట్లుగా ఒక మాజీ నిర్మాత వ్యాఖ్యానించారట. ఆయన పేరెత్తకుండా దిల్ రాజు ఈ విషయం చెప్పి తీవ్ర ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గేమ్ చేంజర్ సినిమా పైరసీ బారిన పడి తాము బాధ పడితే.. ఆ పైరసీ తామే చేసినట్లు ఒక ఎక్స్ ప్రొడ్యూసర్ మాట్లాడ్డం ఎంత నీచం అని దిల్ రాజు ఆవేదన చెందారు. ఎవరైనా ఇంట్లో మనుషులను చంపుకుంటాడా.. పైరసీ అయితే నిర్మాతగా తనతో పాటు తన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ నష్టపోతారని.. అలాంటపుడు తాము ఎలా ఆ పని చేస్తారని.. ఇలా ఎలా మాట్లాడతారని దిల్ రాజు ప్రశ్నించారు.
గేమ్ చేంజర్ సినిమాను విదేశాల్లో ఎక్కడో పైరసీ చేశారని వార్తలు వచ్చాయి. ఐతే అందుబాటులోకి వచ్చిన ప్రింట్‌ను కొందరు యాంటీ ఫ్యాన్స్ పని గట్టుకుని లీక్ చేసి ఆన్ లైన్లో వైరల్ చేశారని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఒక హీరో ఫ్యాన్స్ ఆన్ లైన్లో అదే పనిగా మెసేజ్‌లు పెట్టి పైరసీ లింక్స్ షేర్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. అసలే సినిమాకు నెగెటివ్ టాక్ రాగా.. పైరసీ వల్ల సినిమాకు పెద్ద నష్టమే జరిగింది. చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఇది ఒకటిగా నిలిచింది. దిల్ రాజు ఈ సినిమా వల్ల బాగానే నష్టపోయినా.. సంక్రాంతికి వస్తున్నాం వల్ల కోలుకున్నారు.