విలక్షణమైన సినిమాలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ కొత్త సినిమా డెకాయట్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా అనురాగ్ కశ్యప్ తొలిసారి టాలీవుడ్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి ముందు శృతి హాసన్ ని తీసుకుని కొంత భాగమయ్యాక ఆమెను తప్పించి మృణాల్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే కొంత రీ షూట్ అవసరం పడటంతో షూటింగ్ జాప్యం రిలీజ్ మీద కూడా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఫైనలయ్యింది.
సోలో హీరోగా అడివి శేష్ దర్శనమిచ్చి 3 సంవత్సరాలు దాటేసింది. 2022 డిసెంబర్ లో హిట్ 2 ది సెకండ్ కేస్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. హిట్ 3లో నానితో కలిసి కాసేపు ఫైట్ చేశాడు కానీ అది క్యామియో కాబట్టి పరిగణనలోకి తీసుకోలేం. డెకాయట్ తో పాటు గూఢచారి 2 కూడా సమాంతరంగా తీయాలనే ప్రయత్నం చేయడం రెండు ప్రాజెక్టులను ఆలస్యం చేసింది. ఫైనల్ గా ఏది ముందు పూర్తి చేయాలో క్లారిటీ వచ్చాక పరుగులు పెట్టారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న డెకాయిట్ కథ హీరోయిన్ ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న హీరో చుట్టూ తిరుగుతుంది. అదే కొత్తగా ఉంటుందని అంటున్నారు.
గూఢచారి 2ని వచ్చే ఏడాది రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి అడివి శేష్ లాంటి హీరోలు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సరికొత్త కాన్సెప్ట్స్, ప్యాన్ ఇండియా ఫ్లేవర్ లాంటి విషయాలు మంచిదే కానీ మూడేళ్ళ సమయమంటే చిన్న విషయం కాదు. ఇకపై స్పీడ్ పెంచుతానని చెప్పిన అడివి శేష్ ఈ రెండు సినిమాల తర్వాత ఏది చేస్తాడనే దాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతం ఓ రెండు స్టోరీ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి కానీ డెకాయిట్ పూర్తయ్యాక వాటి మీద నిర్ణయం తీసుకోవచ్చని టాక్. ఇవాళ వచ్చిన టీజర్ చూస్తే కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ఈసారి శేష్ కొంచెం నెగటివ్ టచ్ ట్రై చేసినట్టు ఉన్నాడు.