జూన్ 5 విడుదల కాబోతున్న దగ్ లైఫ్ కోసం కమల్ హాసన్ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నారు. రాష్ట్రాలు తిరుగుతూ పబ్లిసిటీ పరంగా తన వయసుకు మించి కష్టపడుతున్నారు. నిన్న జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ దగ్ లైఫ్ థియేటర్ రన్ మొదలైన 8 వారాల తర్వాతే ఓటిటిలో వస్తుందని, ఆ మేరకు సదరు సంస్థతో కూర్చుని తాము చేసిన చర్చలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని అన్నారు. ఇకపై మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అయితే ఇండస్ట్రీకి మరిన్ని మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ డిస్కషన్ తాలూకు వివరాలు స్టేజి మీద చెప్పలేదు లెండి.
నిజంగానే ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ సైతం 4 వారాల థియేటర్ విండోతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. దీని కారణంగానే ఉత్తరాది మల్టీప్లెక్సులు తమ స్క్రీన్లను తెలుగు తమిళ సినిమాలకు ఇవ్వడం లేదు. ఒకవేళ యాభై రోజుల గ్యాప్ ఉంటే మాత్రమే ఒప్పుకుంటున్నాయి. అందుకే హిట్ 3, రెట్రో లాంటి లేటెస్ట్ రిలీజులు బాలీవుడ్ లో సింగల్ స్క్రీన్లకు పరిమితమయ్యాయి. ఇప్పుడు కమల్ హాసన్ చెప్పిన ప్రకారం చూస్తే ఓటిటి సంస్థలతో చర్చల ద్వారా ఏదైనా సాధ్యమనే స్పష్టత వచ్చేసిందిగా.
ప్రస్తుతం టాలీవుడ్ ఎగ్జిబిటర్లు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కొన్ని మీడియం సినిమాలకు టాక్ ఎంత బాగా వచ్చినప్పటికీ దగ్గర్లో ఓటిటికి వస్తుందనే అభిప్రాయంతో థియేటర్లకు రావడం తగ్గించారని, ఇప్పట్లో డిజిటల్ రిలీజ్ ఉండదని తెలిస్తే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది పక్కనపెడితే కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉంటే గ్యాప్, బడ్జెట్ తో సంబంధం లేకుండా జనం టికెట్లు కొంటారని చాలా సినిమాలు ఋజువు చేశాయి. సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదేమైనా 8 వారాల విండో ఖచ్చితంగా మేలు చేసేదే.