చిన్న దేవరకొండ టిఫినీల యాపారం

Middle Class Melodies -  Motion Poster | Anand Deverakonda | Vinod Anantoju | Amazon Original Movie

చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అండతో గత ఏడాది అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిపోయాడు. తన తమ్ముడు హీరో కావడం ఇష్టం లేదు అంటూనే అతణ్ని బాగానే ప్రమోట్ చేశాడు విజయ్. కానీ చిన్న దేవరకొండ తొలి చిత్రం ‘దొరసాని’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఒక ఇబ్బందైతే.. ఆనంద్ లుక్స్ విషయంలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం మరో సమస్య. ఐతే విజయ్‌కు ఉన్న పేరు వల్లో ఏమో.. ఆనంద్‌కు ఇప్పటి వరకు అవకాశాలకైతే ఢోకా లేకపోయింది.

అతను హీరోగా ఒకటికి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి చడీచప్పుడు లేకుండా పూర్తయిపోయింది కూడా. ఆ సినిమా పేరు.. మిడిల్ క్లాస్ మెలోడీస్. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించాడు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. నిమిషం లోపు నిడివిలో ఉన్న ఈ టీజర్లో సింపుల్‌గా ఈ సినిమా కథేంటో చెప్పేశారు.

ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరి నుంచి గుంటూరు సిటీకి వెళ్లి అక్కడ హోటల్ వ్యాపారం చేయాలని ఆశపడే కుర్రాడి కథ ఇది. అక్కడ ఎంతోమంది ఉండగా.. వాళ్ల పోటీని తట్టుకుని నిలబడ్డం కష్టం కాదని నాన్న అంటే, అమ్మ ప్రోత్సాహంతో గుంటూరుకు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టి హీరో ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో సాగే కథ ఇది. సన్నివేశాలేమీ చూపించకుండా తల్లి, తండ్రి మధ్య సంభాషణలు.. గుంటూరు సిటీ రోడ్లతో పాటు హీరోగారి ‘రాఘవ టిఫిన్ సెంటర్’ను చూపించి టీజర్‌ను ముగించారు.

టీజర్ వరకైతే ఫీల్ గుడ్ టచ్‌తో ప్రేక్షకులు కనెక్టయ్యే సినిమాలాగే కనిపిస్తోంది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న ఈ చిత్రం రిలీజవుతోంది. ఇందులో ఆనంద్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది.