సినిమాలో నటించాం, రెండు మూడు ప్రమోషన్లలో పాల్గొన్నాం, అక్కడితో మా పనైపోయిందని భావించే హీరోలున్న ఇండస్ట్రీలో ఏడు పదుల వయసులో అలుపెరగకుండా పబ్లిసిటీ కోసం పరుగులు పెట్టడం సీనియర్ స్టార్లకే సాధ్యమేమో. అందులోనూ కమల్ హాసన్ ఈ విషయంలో తనదైన ముద్ర చూపిస్తున్నారు. జూన్ 5 విడుదల కాబోతున్న తగ్ లైఫ్ ఈవెంట్ల లిస్టు చూస్తే ఎవరైనా వామ్మో అనక మానరు. మే 17 అంటే ఇవాళ చెన్నైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ జరగనుంది. రెండు రోజులు గ్యాప్ ఇచ్చి హిందీ ఈవెంట్ ముంబైలో మే 20 ప్లాన్ చేశారు. అక్కడి మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇందులో భాగంగా ఉంటుంది.
ఆపై వరసగా 21, 22 తేదీల్లో మలయాళం, తెలుగు ట్రైలర్ లాంచులు విడిగా ఉంటాయి. మే 24 చెన్నైలో ఆడియో రిలీజ్ వేడుక సెపరేట్ గా చేయబోతున్నారు. మే 26 నుంచి 29 దాకా నాలుగు రోజులు నాన్ స్టాప్ గా ఢిల్లీ, బెంగళూరు, త్రివేండ్రం, వైజాగ్ నగరాల్లో స్పెషల్ ప్రోగ్రాంస్ ప్లాన్ చేశారు. మే 31 తగ్ లైఫ్ టీమ్ మలేషియా వెళ్ళిపోయి అక్కడో కార్యక్రమం చేయనుంది. జూన్ 1 దుబాయ్ లో జరిగే మెగా ఈవెంట్ తో ఫైనల్ ఎండింగ్ ఇచ్చేస్తారు. రెండు వారాలు ఏకధాటిగా జరిగే వాటిలో కమల్ హాసన్ మెయిన్ హైలైట్ కాబోతున్నారు. కూడా శింబు, మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ అందుబాటుని బట్టి ఆయనతో పాటు హాజరవుతారు.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామాకు కలయిక పరంగా ఒక ప్రత్యేకత ఉంది. నాయకుడు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చిన 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేతులు కలిపారు. ఈసారి రెహమాన్ తోడవ్వడంతో కల్ట్ మూవీ వస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. తగ్ లైఫ్ కి తెలుగులోనూ మంచి రిలీజ్ దక్కనుంది. పోటీగా ఉంటాయని భావించిన కింగ్ డమ్, హరిహర వీరమల్లు, తమ్ముడు లాంటివి వేరే డేట్లకు వెళ్లిపోవడం కమల్ హాసన్ కు కలిసి వచ్చేలా ఉంది. దీన్ని ఏ మేరకు వాడుకుంటారో జూన్ 5 తేలనుంది.