అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ ఎప్పుడో అర్థం కాకా మెగా ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. రామ రామ పాట పాతిక మిలియన్ల వ్యూస్ తెచ్చుకుందని ప్రచారం చేయడం తప్ప ఇంకెలాంటి ప్రమోషన్లు జరగడం లేదు. అభిమానులు ఇంద్ర వచ్చిన జూలై 24 ఈ సినిమా కూడా వచ్చి రికార్డులు బద్దలు కొడుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తే వాళ్ళ నమ్మకం నీరుగారేలా ఉంది. ఎందుకంటే విశ్వంభర ఆ నెలలో రావడం అనుమానమేనని యువి & మెగా వర్గాల కథనం.

అసలు ఇంత ఆలస్యం ఎందుకనే పాయింట్ పక్కనపెడితే మంచి అవకాశాలను విశ్వంభర పోగొట్టుకున్న వైనం స్పష్టం. జులై వద్దనుకుంటే ఆగస్ట్ లో రావడం అసాధ్యం. ఎంత చిరు పుట్టినరోజు ఉన్నా సరే వార్ 2, కూలిలను తట్టుకోవడం అంత సులభం కాదు. పైగా హైప్ పరంగా చూసుకుంటే మెగా మూవీ కన్నా ఆ రెండే ముందు వరసలో ఉంటాయన్నది వాస్తవం. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే వార్ దెబ్బకే నార్త్ లో సైరా నరసింహారెడ్డి వసూళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పుడు హృతిక్ రోషన్ కు తోడుగా జూనియర్ ఎన్టీఆర్ యాడయ్యాడు. ఇక ఏమవుతుందో వేరే చెప్పాలా. కూలి సంగతి సరే సరి. ఆకాశమే హద్దుగా హైప్ పెరుగుతోంది.

ఒకవేళ విశ్వంభర కనక జూలై 24 వదులుకుంటే దాన్ని తీసుకునేందుకు నితిన్ తమ్ముడు సిద్ధంగా ఉన్నాడని ఫిలిం నగర్ టాక్. అదే జరిగే పక్షంలో మెగాస్టార్ సెప్టెంబర్ కి షిఫ్ట్ అయిపోవాలి. అంతకన్నా లేట్ చేసేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్న ఎంటర్ టైనర్ 2026 జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చేస్తుంది. రెండింటి మధ్య తగినంత గ్యాప్ అవసరం. కానీ విశ్వంభర వరస చూస్తుంటే విఎఫెక్స్ వల్ల లేటవుతోందో లేక ఇంకేదైనా కారణముందో అర్థం కావడం లేదు. ఒక ఐటెం సాంగ్ షూట్ పెండింగ్ ఉంది. రీ రికార్డింగ్ ఇంకా జరగలేదు. ఈ డౌట్లన్నీ ఎప్పుడు తీరతాయో చూడాలి.