-->

40 సంవత్సరాల నిరీక్షణ…నిజం చేయనున్న లోకేష్

ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై డెబ్భై వయసు దాటిన ఇద్దరు సీనియర్ స్టార్లతో మల్టీస్టారర్ చేయడం అంత సులభం కాదు. అసలు తక్కువ ఈడులో ఉన్న ఇప్పటి హీరోలను కలపడమే కష్టంగా ఉన్న దర్శకులు అందుకే ఇలాంటి కాంబోల గురించి ఆలోచించడం మానేశారు. కానీ లోకేష్ కనగరాజ్ శైలి వేరు. రజనీకాంత్, కమల్ హాసన్ లను పెట్టి ఒక సినిమా తీస్తానని అంటున్నాడు. ఇటీవలే ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన తమిళ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు. అందులో సూపర్ స్టార్, లోక నాయకుడు ప్రస్తావన వచ్చింది. ఈ కలయికకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

ఇద్దరు గ్యాంగ్ స్టర్లు వార్ధక్యంలోకి వచ్చాక ఏం చేస్తారనే పాయింట్ మీద సబ్జెక్టు రెడీ చేస్తానని, దానికి ఇద్దరూ సంసిద్ధంగా ఉన్నారని వివరించాడు. నిప్పు లేనిది పొగరాదు తరహాలో బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జరుగుతోంది కాబట్టే లోకేష్ ఇంత ధీమాగా చెప్పి ఉండొచ్చు. ఈ కాంబో ఎందుకంత స్పెషల్ అంటే రజని, కమల్ కలిసి తెరను పంచుకుని అక్షరాలా 40 సంవత్సరాలు అయ్యింది. 1985లో రిలీజైన బాలీవుడ్ మూవీ గిరఫ్తార్ లో చివరిసారి కలిసి నటించారు. సుమారు పదిహేను సినిమాలు వీళ్ళ కలయికలో ఉన్నాయి. పెరిగిన ఇమేజ్ దృష్ట్యా 90 దశకం నుంచి ఎవరూ ఈ సాహసం చేయలేకపోయారు.

లోకేష్ డైరెక్షన్ లో కమల్ విక్రమ్ చేస్తే రజనీకాంత్ కూలిలో నటించారు. ఎవరికి ఏ పాత్ర సూటవుతుందో దానికి అనుగుణంగానే హీరోలను ఎంచుకుంటాను తప్పించి కేవలం డేట్లున్నాయనే కారణంతో ఒకరికి సెట్టయ్యే స్టోరీ మరొకరికి చెప్పనంటున్నాడు లోకేష్. ఖైదీ 2 త్వరలోనే మొదలుపెట్టబోతున్న లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత రోలెక్స్, విక్రమ్ 2 లియో 2 లను లైన్ లో పెట్టాడు. వీటిలో రోలెక్స్ స్టాండ్ అలోన్ మూవీగా విడిగా వస్తుందట. సినిమాటిక్ యునివర్స్ లో అవసరాన్ని బట్టి కలపడం, వేరు చేయడం చేస్తానని చెబుతున్న లోకేష్ కి మాస్టర్ 2 తీయాలని కోరికగా ఉందట. కాకపోతే విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఛాన్స్ లేనట్టే.