ఒకప్పుడు ఇండియాలో ఏ స్టార్‌కూ సాధ్యం కాని రీతిలో భారీ విజయాలందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్.. ఇలా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవడంతో ఆమిర్ ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. కథల ఎంపికలో, మేకింగ్‌లో తనదైన ముద్ర చూపిస్తూ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ ‘దంగల్’ తర్వాత మాత్రం ఆయనకు అస్సలు కలిసి రావడం లేదు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రాలతో మామూలు దెబ్బలు తినలేదు ఆమిర్. ముఖ్యంగా హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తీసిన ‘లాల్ సింగ్ చడ్డా’ దారుణమైన ఫలితాన్నందుకుంది. తొలి రోజు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేశారంటే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుందో అర్థం చేసుకోవచ్చు.
దీంతో ఆమిర్ బ్రేక్ తీసుకున్నాడు. గ్యాప్ తర్వాత ‘సితారే జమీన్ పర్’ సినిమా చేశాడు.
ఆమిర్ ముఖ్య పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ అప్పట్లో ప్రేక్షకులను కదిలించేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ తీశారు. ఐతే ఈసారి ఆమిర్ నటకే పరిమితం అయ్యాడు. దర్శకత్వ బాధ్యతలు ‘శుభ్ మంగల్ జ్యాదా సావధాన్’ ఫేమ్, తమిళ దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్నకు అప్పగించాడు. ఆమిర్ స్ట్రగుల్లో ఉండడం వల్ల కావచ్చు. అతను డైరెక్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు. దీనిపై అంచనాలు తక్కువే ఉన్నాయి.
ఐతే విడుదలకు నెల ముందే ఈ సినిమాకు స్పెషల్ ప్రిమియర్లు వేస్తున్నారు. అది చూసిన వాళ్లు సినిమా బాగుందనే అంటున్నారు. కానీ అదే టైంలో ఈ చిత్రం స్పానిష్ ఫిలిం ‘ఛాంపియన్స్’కు కాపీ అని అంటున్నారు. ఈ రెండు చిత్రాల పోస్టర్లలోనూ పోలికలు కనిపిస్తున్నాయి. ‘ఛాంపియన్స్’ స్పెయిన్లో పెద్ద హిట్ అయ్యాక వేరే భాషల్లోనూ రీమేక్ అయింది. మరి ఆమిర్ టీం అధికారికంగా హక్కులు తీసుకుని సినిమాను రీమేక్ చేస్తోందా.. లేక ఐడియాను కాపీ కొట్టి ఫ్రీమేక్ కానిచ్చేసిందా అన్నది తెలియదు. అయినా ‘తారే జమీన్ పర్’ సీక్వెల్ అని చెప్పి వేరే కథతో సినిమా తీయడమేంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ జూన్ 20న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ కావడం ఆమిర్‌కు చాలా చాలా అవసరం.