లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్ 5 విడుదల కాబోతున్న తగ్ లైఫ్ కోసం ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టేశారు. తెలుగు మీడియాని ప్రత్యేకంగా చెన్నై పిలిపించి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం అందులో భాగమే. నాయకుడు కలయిక జరిగిన ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత మణిరత్నంతో కమల్ చేసిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో హీరోగా శింబు నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, పెద్ద క్యాస్టింగ్ లాంటి ఆకర్షణలు అంచనాలు పెంచుతున్నాయి. ఏపీ తెలంగాణలో భారీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇంత జాగ్రత్త వహించడం వెనుక కారణముంది. తగ్ లైఫ్ కి జూన్ 5 ముందు వెనుకా ఏ సినిమాలు పోటీకి వస్తాయో అంతు చిక్కడం లేదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మే 30 లేదా జూన్ 12 ఆప్షన్లు చూస్తోంది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రావొచ్చు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వచ్చేది దాదాపు ఖరారు అంటున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు. జూన్ 20 కుబేర, సితారే జమీన్ పర్ అటుపై 27 కన్నప్ప వరసగా కాచుకుని ఉన్నాయి. సో మొదటి వారం పది రోజులు తగ్ లైఫ్ కు చాలా కీలకం. ఓపెనింగ్స్ రావాలంటే ఊరికే ఉంటే కుదరదు. అందుకే కమల్ స్వయంగా రంగంలోకి దిగారు.
విక్రమ్ బ్లాక్ బస్టర్ సాధించాక కమల్ హాసన్ కు భారతీయుడు 2 రూపంలో షాక్ కొట్టింది. ఆ గాయాన్ని పూర్తిగా మాన్పుతుందనే నమ్మకం తగ్ లైఫ్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ డబ్బింగ్ వెర్షన్లు ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ తగ్ లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని మణిరత్నం భావిస్తున్నారు. పైకి గ్యాంగ్ స్టర్ డ్రామాలా కనిపిస్తున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఊహించని మలుపులు చాలానే ఉంటాయట. త్రిష హీరోయిన్ గా నటించగా సాన్య మల్హోత్రా లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఇందులో భాగమయ్యింది. తగ్ లైఫ్ కనక బ్లాక్ బస్టర్ అయితే రజనీకాంత్ తో ఓ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నారు మణిరత్నం.