హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో కొనసాగడం హీరోయిన్లకు సాధ్యం కాదు. హీరోయిన్లు ప్రైమ్‌లో ఉండగా వెంటపడే నిర్మాతలు, అభిమానులు, మీడియా వాళ్లు.. తర్వాత పెద్దగా పట్టించుకోరు. గ్లామర్ తగ్గగానే లైట్ తీసుకోవడం మొదలుపెడతారు. సమంత కూడా ఇటీవల ఇలాంటి పరిస్థితే చూస్తోంది. ఓవైపు వయసు పెరిగింది. ఇంకోవైపు పెళ్లి, విడాకులు, అనారోగ్యంతో ఒడుదొడుకులు ఎదుర్కొంది. తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కథానాయికగా ఆమెకు అవకాశాలు దాదాపుగా ఆగిపోయాయి. సిటాడెల్ వెబ్ సిరీస్ మీద చాలా ఆశలు పెట్టుకుంది కానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో హీరోయిన్‌గా ఖాళీ అయిపోయిన పరిస్థితి.
ఐతే సమంత వ్యక్తిగా ఎంత స్ట్రాంగ్ అన్నది తెలియంది కాదు. కాబట్టే ఇండస్ట్రీలో మళ్లీ నిలదొక్కుకోవడానికి ఇంకో మార్గాన్ని ఎంచుకుంది. తనే నిర్మాతగా మారి రెండు సినిమాలు లైన్లో పెట్టింది. తనే కథానాయికగా మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసింది కానీ.. అది అనుకున్నంత వేగం పుంజుకున్నట్లుగా కనిపించలేదు. అసలు షూటింగ్ జరుగుతున్నట్లు కూడా సంకేతాలు లేవు. కానీ ఈలోపు సమంత తాను ఓ కీలక పాత్ర చేస్తూ, ఎక్కువగా కొత్త వాళ్లను పెట్టి.. నిర్మాతగా శుభం అనే హార్రర్ కామెడీ సినిమాను మొదలుపెట్టింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సౌండే లేదు. నేరుగా ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ట్రైలర్ సినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. కంటెంట్ మీద టీం చాలా ధీమాగా ఉంది. సినిమా సర్ప్రైజ్ హిట్ అవుతుందనే చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. ప్రస్తుతం ఇండస్ట్రీ స్లంప్ చూస్తోంది. బాక్సాఫీస్ పరిస్థితులు ఏమంత బాగా లేవు. మొన్న హిట్-2తో మూవీతో కొంచెం ఉత్సాహం వచ్చింది. ఈ వారం సింగిల్‌తో పాటు శుభం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. శుభంతో హిట్ కొడితే నిర్మాతగా సమంత శుభారంభం అందుకోవడంతో పాటు ఇండస్ట్రీకి కూడా అత్యావశ్యకమైన స్థితిలో ఓ విజయాన్ని ఇచ్చినట్లవుతుంది. అలాగే నటిగా కూడా ఆమెకు ఒక బ్రేక్ దక్కినట్లే. ఇకపై ఇలాంటి స్పెషల్ రోల్స్‌కు ఆమెను కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఒక్క హిట్‌తో చాలా ప్రయోజనాలుంటాయి. మరి సమంత.. ఈ నెల 9న ‘శుభం’తో ఎంతో కీలకమైన హిట్‌ను డెలివర్ చేస్తుందా?